CSK: ఆ రెండు తప్పుల వల్లే ఓడిపోయాం: రుతురాజ్‌ IPL 2024 We Did Not: Ruturaj Explains Reasons Behind CSK Bitter Loss Vs SRH | Sakshi
Sakshi News home page

Ruturaj Gaikwad:: ఆ రెండు తప్పులే మా ఓటమికి కారణం.. ఆఖర్లో కేవలం..

Published Sat, Apr 6 2024 10:37 AM | Last Updated on Sat, Apr 6 2024 12:46 PM

IPL 2024 We Did Not: Ruturaj Explains Reasons Behind CSK Bitter Loss Vs SRH - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుగైన ఆరంభం అందుకున్నా .. దానిని నిలబెట్టుకోలేకపోయామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. ఉప్పల్‌ పిచ్‌పై 170- 175 పరుగులు చేసి ఉంటే ఫలితం కాస్త వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు తెలివిగా బ్యాటింగ్‌ చేశారని కొనియాడాడు.

కాగా ఐపీఎల్‌-2024లో సీఎస్‌కే తమ నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో రచిన్‌ రవీంద్ర(12) మరోసారి తేలిపోగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌(26) కాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేశాడు.

ఇక ఉప్పల్‌ పిచ్‌ స్లోగా ఉండటంతో రన్స్‌ తీయడానికి ఇబ్బంది పడ్డ రహానే 30 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేయగా.. శివం దూబే మాత్రం మెరుపులు(24 బంతుల్లో 45) మెరిపించాడు. స్పిన్నర్లను అటాక్‌ చేస్తూ పరుగులు రాబట్టాడు.

దీంతో స్పిన్నర్లను పక్కనపెట్టి పేసర్లను దించిన రైజర్స్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ తన బౌలింగ్‌లో దూబేను అవుట్‌ చేశాడు. అనంతరం జడ్డూ(31- నాటౌట్‌), డారిల్‌ మిచెల్‌(13) కాసేపు బ్యాట్‌ ఝులిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో సీఎస్‌కేకు కేవలం 38 పరుగులు మాత్రమే వచ్చాయి.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సీఎస్‌కే 165 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఆరంభంలో ట్రవిస్‌ హెడ్‌ క్యాచ్‌ను మొయిన్‌ అలీ మిస్‌ చేయగా అతడికి లైఫ్‌ లభించింది. ఇక పవర్‌ ప్లేలో విధ్వంసరచన చేసిన అభిషేక్‌ శర్మ (12 బంతుల్లోనే 37 రన్స్‌)రైజర్స్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 

ఆ రెండు తప్పులే కొంపముంచాయి
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. ‘‘ఈ పిచ్‌ చాలా స్లోగా ఉంది. వాళ్ల బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారు. 

ఆరంభంలో మేము బాగానే ఆడాం. అయితే, తర్వాత వాళ్లు పైచేయి సాధించారు. ఇది నల్లరేగడి పిచ్‌.. నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ.. కానీ మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయిపోయింది.

పవర్‌ ప్లేలో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఓ క్యాచ్‌ మిస్‌ చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రత్యర్థిని 19వ ఓవర్‌ వరకు తీసుకువచ్చాం’’ అని పేర్కొన్నాడు. ఆఖరి వరకు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవర్‌ ప్లేలో రైజర్స్‌ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని రుతురాజ్‌ గైక్వాడ్‌ అంగీకరించాడు.

చదవండి: జడ్డూ అవుట్‌ కావాలి కదా? కమిన్స్‌ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement