IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడు IPL 2024: Sunil Narine Becomes The First Player To Win MVP Award Thrice In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

Published Mon, May 27 2024 9:07 AM | Last Updated on Mon, May 27 2024 9:25 AM

IPL 2024: Sunil Narine Becomes The First Player To Win MVP Award Thrice In IPL History

కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

2012.. తన డెబ్యూ సీజన్‌లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్‌.. 2018 సీజన్‌లో.. తాజాగా 2024 సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్‌.. 2018 సీజన్‌లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టాడు.

ఈ సీజన్‌లో మెంటార్‌ గంభీర్‌ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన నరైన్‌.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో నరైన్‌ బ్యాట్‌ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నరైన్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.

ఇదిలా ఉంటే, కేకేఆర్‌ ఐపీఎల్‌లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్‌ ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మిచెల్‌ స్టార్క్‌ (3-0-14-2, 2 క్యాచ్‌లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్‌ శర్మ (2), ట్రివిస్‌ హెడ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. 

కమిన్స్‌ కాకుండా మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్‌ (2.3-0-19-3), హర్షిత్‌ రాణా (4-1-24-2), సునీల్‌ నరైన్‌ (4-0-16-1), వరుణ్‌ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. 

రహ్మానుల్లా గుర్భాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్‌ నరైన్‌ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement