IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M' IPL 2024 Final, KKR vs SRH: All The Player Of The Match Award Names Of KKR In IPL Finals Start With M | Sakshi
Sakshi News home page

IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'

Published Mon, May 27 2024 7:32 AM | Last Updated on Mon, May 27 2024 8:53 AM

IPL 2024 Final, KKR vs SRH: All The Player Of The Match Award Names Of KKR In IPL Finals Start With M

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

అంతిమ సమరంలో మిచెల్‌ స్టార్క్‌ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్‌ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్‌ చరిత్ర సృష్టించాడు. స్టార్క్‌ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్‌లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.

సీజన్‌ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్‌ అత్యంత కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్‌లో స్టార్క్‌ సన్‌రైజర్స్‌ పాలిట విలన్‌గా దాపురించాడు.

మరోసారి కలిసొచ్చిన 'M'
ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్‌ ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. 

MMM
2012లో మన్విందర్‌ బిస్లా, 2014లో మనీశ్‌ పాండే, తాజాగా మిచెల్‌ స్టార్క్‌ ఫైనల్స్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్‌ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్‌ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్‌ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ మిచెల్‌ స్టార్క్‌ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (2), ట్రివిస్‌ హెడ్‌ (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్‌ కాకుండా మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్‌ (2.3-0-19-3), హర్షిత్‌ రాణా (4-1-24-2), సునీల్‌ నరైన్‌ (4-0-16-1), వరుణ్‌ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్‌ నరైన్‌ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది. సిరీస్‌ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్‌ నరైన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement