పతకానికి విజయం దూరంలో...  | Indian wrestler who defeated the world champion in the first round | Sakshi
Sakshi News home page

పతకానికి విజయం దూరంలో... 

Published Thu, Sep 21 2023 1:23 AM | Last Updated on Thu, Sep 21 2023 1:23 AM

Indian wrestler who defeated the world champion in the first round - Sakshi

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): భారత రెజ్లింగ్‌ రైజింగ్‌ స్టార్‌ అంతిమ్‌ పంఘాల్‌ సీనియర్‌ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన అంతిమ్‌... ప్రస్తుతం ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక రేసులో నిలిచింది. సెమీఫైనల్లో అంతిమ్‌ 4–5 పాయింట్ల తేడాతో వనెసా కలాద్‌జిన్‌స్కాయా (బెలారస్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక బౌట్‌లో అంతిమ్‌ గెలిస్తే పతకంతోపాటు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ కూడా ఖరారవుతుంది.

సాట్‌ల్‌విరా ఒర్‌షుష్‌ (హంగేరి), ఎమ్మా జోనా డెనిస్‌ మాల్‌్మగ్రెన్‌ (స్వీడన్‌) మధ్య బౌట్‌ విజేతతో కాంస్య పతకం పోరులో అంతిమ్‌ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్‌లో అంతిమ్‌ 3–2తో డిఫెండింగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ ఒలివియా పారిష్‌ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అంతిమ్‌ 10–0తో రొక్సానా మార్టా జసినా (పోలాండ్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 9–6తో నటాలియా మలిషెవా (రష్యా)పై గెలుపొందింది.

భారత్‌కే చెందిన మనీషా (62 కేజీలు), ప్రియాంక (68 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో, జ్యోతి బెర్వాల్‌ (72 కేజీలు) తొలి రౌండ్‌లోనే  నిష్క్రమించారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత రెజ్లర్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) పతాకంపై, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్‌ రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement