మనదే యువ ప్రపంచం | India win ICC Under 19 Men Cricket World Cup 2022 with victory over England | Sakshi
Sakshi News home page

U 19 World Cup Ind Vs Eng: మనదే యువ ప్రపంచం

Published Mon, Feb 7 2022 4:32 AM | Last Updated on Tue, Feb 8 2022 12:34 PM

India win ICC Under 19 Men Cricket World Cup 2022 with victory over England - Sakshi

కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోయినా... మెగా ఈవెంట్‌ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్‌లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో యువ భారత్‌ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది.

యశ్‌ ధుల్‌ కెప్టెన్సీలో భారత్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్‌ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ, హర్నూర్, షేక్‌ రషీద్, యశ్‌ ధుల్, నిశాంత్, రాజ్‌ బావా, విక్కీ ఒస్త్‌వాల్, రవి కుమార్‌... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు.

న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్‌ జట్టు అండర్‌–19 ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్‌–19 ప్రపంచకప్‌ జరగ్గా... యువ భారత్‌ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, మూడుసార్లు రన్నరప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది.

భారత పేస్‌ బౌలర్లు రాజ్‌ బావా (5/31), రవి కుమార్‌ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్‌ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్‌ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌), వికెట్‌ కీపర్‌ దినేశ్‌ (5 బంతుల్లో 13 నాటౌట్‌; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన రాజ్‌ బావా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్‌ బ్రెవిస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెల్చుకున్నాడు.

బీసీసీఐ అభినందన...
అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్‌ కోచ్‌ హృషికేశ్‌ కనిత్కర్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.   

సత్కారం...
ఇంగ్లండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్‌ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్‌స్టర్‌డామ్‌ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్‌ సీనియర్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో మూడు వన్డేల సిరీస్‌ జరుగుతోంది. అహ్మదాబాద్‌ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది.

ప్రధాని శుభాకాంక్షలు
ప్రపంచకప్‌ నెగ్గిన భారత అండర్‌–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్‌ క్రికెట్‌ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్‌–19 ప్రపంచకప్‌ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్‌ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్‌లు, టోర్నమెంట్‌లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్‌ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం.
  
 –వీవీఎస్‌ లక్ష్మణ్, ఎన్‌సీఏ హెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement