India Reach 215 For 2 At Stumps On Day 3, Trail By 139 Runs - Sakshi
Sakshi News home page

ఎందాక ఈ ఎదురీత!

Published Sat, Aug 28 2021 5:27 AM | Last Updated on Mon, Sep 20 2021 11:55 AM

India reach 215 for 2 at stumps on Day 3, trail by 139 runs - Sakshi

లీడ్స్‌: తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, చతేశ్వర్‌ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్‌ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ప్రస్తుతం భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్‌ రహానే, జడేజా, పంత్‌ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్‌ కోలుకునే అవకాశం ఉంది.  

9 పరుగులే చేసి...
మూడో రోజు ఇంగ్లండ్‌ ఎక్కువ సేపు ఏమీ ఆడలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో శుక్రవారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 9 పరుగులు చేసి 432 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్టన్‌ (32; 6 ఫోర్లు)ను షమీ ఎల్బీగా పంపించగా... రాబిన్సన్‌ (0)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. షమీ 4 వికెట్లను పడగొట్టగా, బుమ్రా, సిరాజ్, స్పిన్నర్‌ జడేజా తలా 2 వికెట్లు తీశారు. అయితే ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఆ ఇద్దరు నిలబడ్డారు...
ప్రత్యర్థి కొండంత ఆధిక్యంలో ఉంది. దీన్ని కరిగించాలంటే క్రీజులో పాతుకుపోవాలి. ఇంకో దారేం లేదు. ఇలాంటి స్థితితో రోహిత్, రాహుల్‌ అదే పని చేశారు. 16వ ఓవర్లో రాబిన్సన్‌ వేసిన బౌన్సర్‌ను రోహిత్‌  థర్డ్‌మ్యాన్‌ దిశగా సిక్సర్‌ బాదాడు. గంటన్నరపాటు క్రీజులో నిలిచిన రాహుల్‌ (54 బంతుల్లో 8) చివరకు ఓవర్టన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అప్పుడే 34/1 స్కోరు వద్ద భారత్‌ లంచ్‌కు వెళ్లింది. తర్వాత పుజారా క్రీజులోకి రాగా ఇంగ్లండ్‌ బౌలర్లకు ఇంకో వికెట్‌ కోసం సుదీర్ఘ శ్రమ తప్పలేదు.

రోహిత్‌ 125 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ పేస్‌ వాడిపోగా... భారత బ్యాట్స్‌మెన్‌లో ధీమా పెరిగింది. కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన పుజారా ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఇంగ్లండ్‌ బౌలర్లకు ఈ సెషన్లో అలసటే తప్ప వికెట్లు రాలేదు. ఆఖరి సెషన్లో రోహిత్‌ ఔటైనప్పటికీ పుజారా... కెప్టెన్‌ కోహ్లి అండతో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 మార్క్‌ను దాటించారు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78;
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్‌ 59; కేఎల్‌ రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఓవర్టన్‌ 8; పుజారా (బ్యాటింగ్‌) 91; విరాట్‌ కోహ్లి (బ్యాటింగ్‌) 45; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (80 ఓవర్లలో 2 వికెట్లకు) 215.
వికెట్ల పతనం: 1–34, 2–116.
బౌలింగ్‌: అండర్సన్‌ 19–8–51–0, రాబిన్సన్, 18–4–40–1, ఓవర్టన్‌ 17–6–35–1, స్యామ్‌ కరన్‌ 9–1–40–0, మొయిన్‌ అలీ 11–1–28–0, రూట్‌ 6–1–15–0. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement