IND VS SA 2nd T20: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌  | IND VS SA 2nd T20: Suryakumar Yadav Is The Fastest To Complete 2000 Runs In T20I In Terms Of Balls | Sakshi
Sakshi News home page

IND VS SA 2nd T20: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ 

Published Tue, Dec 12 2023 9:45 PM | Last Updated on Thu, Dec 14 2023 12:12 PM

IND VS SA 2nd T20: Suryakumar Yadav Is The Fastest To Complete 2000 Runs In T20I In Terms Of Balls - Sakshi

సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద టీ20ల్లో 2000 పరుగుల మార్కును తాకిన స్కై.. బంతుల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

పొట్టి ఫార్మాట్‌లో స్కై కేవలం 1164 బంతుల్లోనే 2000 పరుగుల మార్కును తాకగా.. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ పేరిట ఉండింది. ఫించ్‌ 1283 బంతుల్లో 2000 పరుగుల మార్కును దాటాడు. ఈ రికార్డుతో పాటు స్కై మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. స్కై 56  ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకోగా.. పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, అదే దేశానికి చెందిన మొహమ్మద్‌ రిజ్వాన్‌ (52 ఇన్నింగ్స్‌ల్లో) ఈ విభాగంలో అందరి కంటే ముందున్నారు. స్కైతో పాటు విరాట్‌ కోహ్లి కూడా 56 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును అందుకోగా.. కేఎల్‌ రాహుల్‌ (58 ఇన్నింగ్స్‌ల్లో) వీరిద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు. 

ఈ మ్యాచ్‌లో 2000 అంతర్జాతీయ టీ20 పరుగులు పూర్తి చేసిన స్కై.. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. స్కైకు ముందు విరాట్‌ కోహ్లి (107 ఇన్నింగ్స్‌ల్లో 4008 పరుగులు), రోహిత్‌ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 3853 పరుగులు), కేఎల్‌ రాహుల్‌ (68 ఇన్నింగ్స్‌ల్లో 2256 పరుగులు) భారత్‌ తరఫున ఈ ఫీట్‌ను సాధించారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ (55 నాటౌట్‌) జోరుమీదుండటంతో భారత్‌ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. స్కైతో పాటు రింకూ సింగ్‌ (32) క్రీజ్‌లో ఉన్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ డకౌట్లు కాగా.. తిలక్‌ వర్మ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement