Ind vs Nz 2021: క్లీన్‌స్వీప్‌.. ‘కెప్టెన్‌’ రోహిత్‌ శర్మ సూపర్‌! | Ind vs Nz 2021: India Beat New Zealand 73 Runs In 3rd T20I Clean Sweep | Sakshi
Sakshi News home page

Ind vs Nz 2021: క్లీన్‌స్వీప్‌.. ‘కెప్టెన్‌’ రోహిత్‌ శర్మ సూపర్‌!

Published Mon, Nov 22 2021 9:50 AM | Last Updated on Mon, Nov 22 2021 5:01 PM

Ind vs Nz 2021: India Beat New Zealand 73 Runs In 3rd T20I Clean Sweep - Sakshi

Ind vs Nz 2021: India Beat New Zealand 73 Runs In 3rd T20I Clean Sweep: మ్యాచ్‌ నామమాత్రం అయినప్పటికీ భారత జట్టు నిర్లక్ష్యం చూపకుండా చెలరేగింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా 73 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్‌ శర్మ బృందం 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు.

చివర్లో దీపక్‌ చహర్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ ఆటతీరుతో భారత్‌ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్‌ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ గప్టిల్‌ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (3/9), హర్షల్‌ పటేల్‌ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్‌ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25న కాన్పూర్‌లో మొదలవుతుంది.  

రోహిత్‌ దూకుడు... 
భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ శుభారంభం చేశారు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఖాతా తెరిచిన రోహిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్నే వేసిన రెండో ఓవర్లో ఇషాన్‌ కూడా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఫెర్గూసన్‌ వేసిన ఆరో ఓవర్లో రోహిత్‌ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదగా... ఇషాన్‌ మరో ఫోర్‌ కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో భారత్‌కు 20 పరుగులు లభించాయి. పవర్‌ప్లేలో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.

పవర్‌ ప్లే ముగిశాక టీమిండియా ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. సాన్‌ట్నర్‌ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్‌ (0)లతో పాటు తన తర్వాతి ఓవర్‌లో పంత్‌ (4)ను అవుట్‌ చేశాడు. అయితే మరో ఎండ్‌లో రోహిత్‌ దూకుడు తగ్గించలేదు. అతడు 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సోధి పట్టిన అద్భుత రిటర్న్‌ క్యాచ్‌తో రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. దాంతో భారత్‌  69/0 నుంచి 103/4గా నిలిచింది. చివర్లో హర్షల్‌ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌), దీపక్‌ చహర్‌ దూకుడుగా ఆడారు. మిల్నే వేసిన ఆఖరి ఓవర్లో దీపక్‌ వరుసగా 4, 4, 2, 6, 2, 1తో 19 పరుగులు రాబట్టాడు. 

గప్టిల్‌ ఒక్కడే... 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్‌ మిచెల్‌ (5) త్వరగా అవుటయ్యాడు. చాప్‌మన్‌ (0), ఫిలిప్స్‌ (0)లను అక్షర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్‌ గప్టిల్‌ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చహల్‌ బౌలింగ్‌లో గప్టిల్‌ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో సూర్యకుమార్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌ విఫలమవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైంది.

మీకు తెలుసా?
న్యూజిలాండ్‌పై భారత్‌కిది మూడో టి20 సిరీస్‌ విజయం. రెండు జట్ల మధ్య ఆరు టి20 సిరీస్‌లు జరిగాయి. మరో మూడింటిలో న్యూజిలాండ్‌ గెలిచింది. స్వదేశంలో రోహిత్‌ కెప్టెన్సీలో భారత్‌ గెలిచిన టి20 మ్యాచ్‌ల సంఖ్య. 11

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) సోధి 56; ఇషాన్‌ (సి) సీఫెర్ట్‌ (బి) సాన్‌ట్నర్‌ 29; సూర్యకుమార్‌ (సి) గప్టిల్‌ (బి) సాన్‌ట్నర్‌ 0; పంత్‌ (సి) నీషమ్‌ (బి) సాన్‌ట్నర్‌ 4; శ్రేయస్‌ (సి) మిచెల్‌ (బి) మిల్నే 25; వెంకటేశ్‌ (సి) చాప్‌మన్‌ (బి) బౌల్ట్‌ 20; అక్షర్‌ (నాటౌట్‌) 2; హర్షల్‌ (హిట్‌వికెట్‌) (బి) ఫెర్గూసన్‌ 18; దీపక్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. 
వికెట్ల పతనం: 1–69, 2–71, 3–83, 4–103, 5–139, 6–140, 7–162. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–31–1, మిల్నే 4–0–47–1, ఫెర్గూసన్‌ 4–0–45–1, సాన్‌ట్నర్‌ 4–0–27–3, సోధి 4–0–31–1. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చహల్‌ 51; మిచెల్‌ (సి) హర్షల్‌ (బి) అక్షర్‌ 5; చామ్‌మన్‌ (స్టంప్డ్‌) (బి) అక్షర్‌ 0; ఫిలిప్స్‌ (బి) అక్షర్‌ 0; సీఫెర్ట్‌ (రనౌట్‌) 17; నీషమ్‌ (సి) పంత్‌ (బి) హర్షల్‌ 3; సాన్‌ట్నర్‌ (రనౌట్‌) 2; మిల్నే (సి) రోహిత్‌ (బి) వెంకటేశ్‌ 7; సోధి (సి) సూర్యకుమార్‌ (బి) హర్షల్‌ 9; ఫెర్గూసన్‌ (సి అండ్‌ బి) దీపక్‌ 14; బౌల్ట్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్‌) 111. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–30, 4–69, 5–76, 6–76, 7–84, 8–93, 9–95, 10–111. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0–12–0, దీపక్‌ 2.2–0–26–1, అక్షర్‌ 3–0–9–3, చహల్‌ 4–0–26–1, వెంకటేశ్‌ 3–0–12–1, హర్షల్‌ 3–0–26–2.

చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్‌ చంద్‌... ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement