Ind vs Eng: గోల్డెన్‌ డకౌట్‌.. ఇదేంటి సర్ఫరాజ్‌? నువ్విలా.. Ind vs Eng 4th Test Sarfaraz Khan Called Out for Chilling After Golden Duck | Sakshi
Sakshi News home page

#Sarfaraz Khan: గోల్డెన్‌ డకౌట్‌.. అయినా సర్ఫరాజ్‌ అలా!.. ఫొటో వైరల్‌

Published Mon, Feb 26 2024 5:36 PM | Last Updated on Mon, Feb 26 2024 6:04 PM

Ind vs Eng 4th Test Sarfaraz Khan Called Out for Chilling After Golden Duck - Sakshi

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన ఈ ముంబైకర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

దీంతో సోషల్‌ మీడియా వేదికగా అతడిపై పెద్ద ఎత్తున మీమ్స్‌ వస్తున్నాయి. ‘‘నిన్ను పొగిడితేనే బ్యాట్‌ ఝులిపించగలవా ఏంటి? అయినా ఇప్పటికే నీకు రావాల్సిన దానికంటే.. చాలా ఎక్కువ క్రెడిట్‌ వచ్చేసింది భయ్యా! ఇంకా పొగడటం మా వల్ల కాదు’’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు.

అదే సమయంలో ధ్రువ్‌ జురెల్‌ పేరును ప్రస్తావిస్తూ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

తొలి మ్యాచ్‌లో వరుసగా రెండు అర్ధ శతకాలు(62, 68 నాటౌట్‌) బాదాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌. తద్వారా తొలి టెస్టులోనే ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా దిలావర్‌ హుసేన్‌, సునిల్‌ గావస్కర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

అయితే, తన రెండో మ్యాచ్‌లోనే సర్ఫరాజ్‌ పూర్తిగా తేలిపోవడం గమనార్హం. రాంచి టెస్టులో రెండుసార్లూ ఇంగ్లండ్‌ స్పిన్నర్ల చేతికే చిక్కాడు. రెండు ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్‌ వికెట్‌ను.. టామ్‌ హార్లే, షోయబ్‌ బషీర్‌ దక్కించుకున్నారు.

కాగా రాంచి మ్యాచ్‌లో విజయానికి టీమిండియా 52 పరుగుల దూరంలో ఉన్న సమయంలో సర్ఫరాజ్‌ గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే, సర్ఫరాజ్‌ మాత్రం డగౌట్‌లో కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ మధ్య కూర్చుని చిల్‌ అవుతూ కనిపించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌(52- నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌(39 నాటౌట్‌) అద్బుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. మొత్తంగా 129 పరుగులు చేసిన జురెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement