Harshal Patel Refuses To Shake Hands With Riyan Parag After Heated Argument In RCB Vs RR - Sakshi
Sakshi News home page

Riyan Parag Vs Harshal Patel: ఎంత గొడవపడితే.. ఇది పద్దతి కాదు హర్షల్‌ పటేల్‌

Published Wed, Apr 27 2022 9:15 AM | Last Updated on Wed, Apr 27 2022 11:21 AM

Harshal Patel Refuses Shake Hands Riyan Parag After RCB Vs RR - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌, హర్షల్‌ పటేల్‌ మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. మాటలతో మొదలైన గొడవ దాదాపు కొట్టుకునేస్థాయి వరకు వెళ్లింది. విషయంలోకి వెళితే.. రాజస్తాన్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ రియాన్‌ పరాగ్‌ తొలిసారి బ్యాటింగ్‌లో మెరిశాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేసిన పరాగ్‌.. హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ సహా మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కాగా ఆఖరి బంతికి డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్‌ కొట్టాడు. దీంతో చిర్రెత్తిపోయిన హర్షల్‌ పరాగ్‌వైపు కోపంగా చూస్తూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తానేమైనా తక్కువ తిన్నానా అన్నట్లు పరాగ్‌ కూడా హర్షల్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు.

ఇంతలో రాజస్తాన్‌ ఆటగాళ్లు వెళ్లి పరాగ్‌ను దూరంగా తీసుకెళ్లారు. ఆర్‌సీబీ ఆటగాళ్లు కూడా హర్షల్‌ను కూల్‌ చేశారు. దీంతో వివాదం ఇక్కడికి ముగిసింది అని మనం అనుకున్నాం. కానీ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా పరాగ్‌- హర్షల్‌ పటేల్‌ల గొడవకు ముగింపు లేదని అర్థమైంది. మ్యాచ్‌ పూర్తైన అనంతరం ఇరుజట్లు కరచాలనం చేయడం ఆనవాయితీ. ఎంత గొడవపడినా ఇరుజట్ల ఆటగాళ్లు సారీ చెప్పుకునే సందర్బం ఉంటుంది. కానీ హర్షల్‌ పటేల్‌ మాత్రం ఆనవాయితీని తుంగలో తొక్కాడు. పరాగ్‌ వచ్చి హర్షల్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికి.. అతను కనీసం మొహం కూడా చూడలేదు. పరాగ్‌తో చేతులు కలపడానికి ఇష్టపడని హర్షల్‌ వేరే ఆటగాడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Courtesy: IPL Twitter
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రాజస్తాన్‌ రాయల్స్‌ ​29 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌)దే అత్యధిక స్కోరు. కుల్దీప్‌ సేన్‌ (4/20) రాణించగా, అశ్విన్‌ 3 వికెట్లు, ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు.

చదవండి: ప‌రాగ్, హ‌ర్షల్ ప‌టేల్ మ‌ధ్య గొడ‌వ‌.. కొట్టుకునేంత ప‌ని చేశారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement