ఏపీఎల్‌ నిర్వహణ భేష్‌ | Krishnamachari Srikkanth Lauds APL For Providing Opportunity To Local Cricketers To Showcase Their Talent - Sakshi
Sakshi News home page

Krishnamachari Srikkanth On APL: ఏపీఎల్‌ నిర్వహణ భేష్‌

Published Mon, Aug 28 2023 6:05 AM | Last Updated on Mon, Aug 28 2023 10:47 AM

Former Indian cricketer Srikkanth lauds Andhra Premier League for providing opportunity to local cricketers to showcase their talent - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. ఏపీఎల్‌ రెండో సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను టాస్‌ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం.

నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్‌ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు.

‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్‌లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్‌ ప్యాషన్‌తో ఆడితే.. కోహ్లి ప్యాషన్‌తో పాటు అగ్రెసివ్‌గా ఆడుతాడు. అది వారి స్టయిల్‌. నేను కూడా అగ్రెసివ్‌గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది.

మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్‌ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్‌ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్‌ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్‌ సీజన్‌–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు. 

వెంకట్రావు పేరుతో ‘స్టాండ్‌’ గర్వకారణం 
అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్‌.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్‌ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.

ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్‌ కమిటీ చైర్మన్‌గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా, 2003 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్‌గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్‌లో తలపడుతున్న బెజవాడ టైగర్స్‌ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement