IPL 2024 GT vs DC: ఢిల్లీ అదరహో... Delhi Victory over Gujarat by 6 wickets | Sakshi
Sakshi News home page

IPL 2024 GT vs DC: ఢిల్లీ అదరహో..

Published Thu, Apr 18 2024 5:12 AM | Last Updated on Thu, Apr 18 2024 8:25 AM

Delhi Victory over Gujarat by 6 wickets - Sakshi

గుజరాత్‌పై 6 వికెట్లతో విజయం

89కే టైటాన్స్‌ ఆలౌట్‌

53 బంతుల్లో లక్ష్యం చేరిన క్యాపిటల్స్‌   

వరుస మ్యాచ్‌లలో పరుగుల వరదతో ముంచెత్తుతున్న ఐపీఎల్‌లో ఎట్టకేలకు ఒక స్వల్ప స్కోర్ల పోరు... బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ బ్యాటర్ల పని పట్టిన సమయం... మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ సొంతగడ్డపై 100 పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన చోట... కేవలం 53 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆనందం... రన్‌రేట్‌ను  మెరుగుపర్చుకునేందుకు వేగంగా ఆడే ప్రయత్నంలో నాలుగు వికెట్లు కోల్పోయినా...  చివరకు ఢిల్లీ సునాయాసంగా గెలుపు గీత దాటింది.   

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌ టోర్నీలో టైటాన్స్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

రషీద్‌ ఖాన్‌ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసింది. జేక్‌ ఫ్రేజర్‌ (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇచ్చిన శుభారంభంతో గెలుపునకు పునాది పడింది. చక్కటి కెపె్టన్సీతో పాటు 2 క్యాచ్‌లు, 2 స్టంపింగ్‌లు చేసిన రిషభ్‌ పంత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

రాణించిన ఇషాంత్‌... 
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రషీద్‌ కొద్దిసేపు పోరాడటం మినహా గుజరాత్‌ ఇన్నింగ్స్‌ పేలవంగా సాగింది. ఆసాంతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన జట్టు... వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ తన తొలి ఓవర్లోనే కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (8)ను వెనక్కి పంపి శుభారంభం అందించగా, ఒకే స్కోరు వద్ద సాహా (2), సాయి సుదర్శన్‌ (12) వెనుదిరిగారు.

ఇషాంత్‌ బౌలింగ్‌లోనే పంత్‌ చక్కటి క్యాచ్‌తో డేవిడ్‌ మిల్లర్‌ (2) అవుట్‌ కావడంతో పవర్‌ప్లేను టైటాన్స్‌ 30/4 వద్ద ముగించింది. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ స్టబ్స్‌ కూడా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీయడంతో గుజరాత్‌ పరిస్థితి మరింత దిగజారింది.

ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రషీద్‌ కొన్ని పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు. ఆశలు పెట్టుకున్న రాహుల్‌ తెవాటియా (10)ను అక్షర్‌ పటేల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా మిగతా బ్యాటర్ల ఆట లాంఛనమే అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కొంత తడబడినా చివరకు ఢిల్లీ ఎలాంటి ప్రమాదం లేకుండా మ్యాచ్‌ను ముగించింది.
   
స్కోరు వివరాలు  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) ముకేశ్‌ 2; గిల్‌ (సి) షా (బి) ఇషాంత్‌ 8; సుదర్శన్‌ (రనౌట్‌) 12; మిల్లర్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 2; మనోహర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) స్టబ్స్‌ 8; తెవాటియా (ఎల్బీ) (బి) అక్షర్‌ 10; షారుఖ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) స్టబ్స్‌ 0; రషీద్‌ (సి) పంత్‌ (బి) ముకేశ్‌ 31; మోహిత్‌ (సి) సుమీత్‌ (బి) ఖలీల్‌ 2; నూర్‌ (బి) ముకేశ్‌ 1; జాన్సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్‌) 89. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–28, 4–30, 5–47, 6–48, 7–66, 8–78, 9–88, 10–89. బౌలింగ్‌: ఖలీల్‌ 4–1– 18–1, ఇషాంత్‌ 2–0–8–2, ముకేశ్‌ కుమార్‌ 2.3–0–14–3, కుల్దీప్‌ 4–0–16–0, స్టబ్స్‌ 1–0– 11–2, అక్షర్‌ పటేల్‌ 4–0–17–1.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) జాన్సన్‌ (బి) సందీప్‌ 7; జేక్‌ ఫ్రేజర్‌ (సి) మనోహర్‌ (బి) జాన్సన్‌ 20; పొరేల్‌ (బి) సందీప్‌ 15; హోప్‌ (సి) మోహిత్‌ (బి) రషీద్‌ 19; పంత్‌ (నాటౌట్‌) 16; సుమీత్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం 
(8.5 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–65, 4–67. బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 3–0–40–2; స్పెన్సర్‌ జాన్సన్‌ 2–0–22–1, రషీద్‌ ఖాన్‌ 2–0–12–1, నూర్‌ అహ్మద్‌ 1.5–0–14–0.   

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌ X ముంబై 
వేదిక: ముల్లాన్‌పూర్‌

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement