CWC Qualifiers 2023, Scotland Vs West Indies: West Indies All Out For 181 Against Scotland - Sakshi
Sakshi News home page

CWC Qualifiers 2023: వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్‌! మరీ ఘోరంగా..

Published Sat, Jul 1 2023 4:23 PM | Last Updated on Sat, Jul 1 2023 6:35 PM

CWC Qualifiers 2023: West Indies All Out For 181 Against Scotland - Sakshi

ICC Cricket World Cup Qualifiers 2023 Scotland vs West Indies: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్సెస్‌లో తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పసికూన స్కాట్లాండ్‌ చేతిలో 181 పరుగులకే ఆలౌట్‌ అయింది. స్కాటిష్‌ బౌలర్ల ధాటికి విండీస్‌ టాపార్డర్‌ చేతులెత్తేసింది. ఇక లోయర్‌ ఆర్డర్‌లో జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌ రాణించడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది.

టాపార్డర్‌ కుదేలు
సూపర్‌ సిక్సెస్‌ మ్యాచ్‌ 3లో భాగంగా విండీస్‌- స్కాట్లాండ్‌ హరారే వేదికగా తలపడుతున్నాయి. శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

పూరన్‌, హోల్డర్‌ ఇన్నింగ్స్‌ వల్ల
ఓపెనర్‌ జాన్సన్‌ చార్ల్స్‌ డకౌట్‌గా వెనురిగాడు. మరో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌(22) కాసేపు పోరాడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రూక్స్‌ సున్నాకే పరిమితం కావడంతో విండీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ షాయీ హోప్‌(13), కైలీ మేయర్స్‌(5) పూర్తిగా నిరాశపరిచారు.

ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన నికోలస్‌ పూరన్‌ 21 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హోల్డర్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రొమారియో షెఫర్డ్‌ 36 పరుగులతో రాణించాడు. దీంతో 43.5 ఓవర్లలో 181 రన్స్‌ చేసి వెస్టిండీస్‌ ఆలౌట్‌ అయింది. 

రేసులో నిలవాలంటే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే
స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాండన్‌ మెక్‌ములెన్‌కు అత్యధికంగా మూడు.. క్రిస్‌ సోలే, మార్క్‌ వాట్‌, క్రిస్‌ గ్రేవ్స్‌ రెండేసి వికెట్లు తీశారు. సఫ్యాన్‌ షరీఫ్‌నకు ఒక వికెట్‌ దక్కింది. ఇక వెస్టిండీస్‌ వరల్డ్‌కప్‌-2023 అర్హత రేసులో నిలవాలంటే సూపర్‌ సిక్స్‌లో అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవాల్సి ఉంది.

ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంక ముందడుగు వేయగా.. పసికూన స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ విండీస్‌ ఈ మేరకు దారుణ ప్రదర్శన కనబరచడం గమనార్హం. రన్‌రేటు పరంగా భారీగా వెనుకబడి ఉన్న షాయీ హోప్‌ బృందం ఒకవేళ స్కాట్లాండ్‌ను చిత్తుగా ఓడిస్తే ఇప్పటికి ప్రపంచకప్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

చదవండి: కోటి చాలదు! వద్దే వద్దు! ఇంకా పెంచుతాం.. బీసీసీఐ హామీ.. ఎట్టకేలకు..
Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్‌ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement