ఐపీఎల్‌ స్పాన్సర్‌ ఎవరు?  | BCCI Already Says About IPL 2020 Sponsorship | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ స్పాన్సర్‌ ఎవరు? 

Published Fri, Aug 7 2020 3:12 AM | Last Updated on Fri, Aug 7 2020 8:08 AM

BCCI Already Says About IPL 2020 Sponsorship - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020కి ప్రముఖ మొబైల్‌ సంస్థ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘వివో’ లీగ్‌నుంచి తప్పుకున్నట్లు రెండు రోజుల క్రితమే దాదాపు ఖరారైపోగా... బోర్డు మాత్రం ఇప్పుడు తమ వైపునుంచి నిర్ధారిస్తూ ప్రకటన జారీ చేసింది. ‘2020 ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ, వివో మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి’ అంటూ ఏకవాక్యంతో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇందుకు కారణాలు, ఇతర వివరాలేమీ పేర్కొనలేదు. అయితే బోర్డు ప్రకటన ప్రకారం చూస్తే ఐపీఎల్‌కు వివో దూరం కావడం ఈ ఒక్క ఏడాదికే పరిమితమని తెలుస్తోంది. ఆపై ఒప్పందాన్ని పునస్సమీక్షిస్తారా, మళ్లీ జత కడతారా అనేది మాత్రం ప్రస్తావించలేదు. సంవత్సరం తర్వాత పరిస్థితులు చక్కబడితే అప్పుడు దానిపై ఆలోచించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు తరఫునుంచి కనీసం కార్యదర్శి లేదా మరెవరి పేరు, సంతకం కూడా లేకుండా బీసీసీఐ పత్రికా ప్రకటన జారీ చేయడం విశేషం. మరోవైపు ఐపీఎల్‌తో భాగస్వామ్యానికి ‘విరామం’ ఇస్తున్నట్లు వివో ప్రకటించింది.

బరిలో ఆ మూడు... 
ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా ‘వివో’ ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి వివో తప్పుకోవడంలో భారతీయుల మనోభావాలతో పాటు ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితుల్లో తాము ఈ సారి రూ. 440 కోట్లు చెల్లించలేమని, కనీసం 50 శాతం మొత్తాన్ని తగ్గించాలంటూ వివో కొన్నాళ్ల క్రితం బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. దీనికి బోర్డు ఒప్పుకోలేదు.  ఇప్పుడు ‘వివో’ తప్పుకోవడంతో పలు ప్రముఖ సంస్థలు స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వస్తున్నట్లు సమాచారం. వేర్వేరు కారణాలతో ఈసారి అంత భారీ మొత్తం రాకపోయినా... కొంత తక్కువగా చెల్లించి స్పాన్సర్‌గా వ్యవహరించాలని  ప్రధానంగా మూడు సంస్థలు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో మొదటగా వినిపిస్తున్న పేరు ‘బైజూస్‌’. ఈ సంస్థ ఇప్పటికే భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ భాగస్వామ్యం కారణంగా బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని సమాచారం. కరోనా నేపథ్యంలో పెరిగిన ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా అత్యంత ఆర్జన పొందిన సంస్థల్లో ఒకటిగా బైజూస్‌ నిలిచింది. టీమిండియాలాగే బీసీసీఐకి చెందిన మెగా ఈవెంట్‌తో కూడా జత కట్టాలని ఆ కంపెనీ కోరుకుంటోంది. బైజూస్‌కు ప్రధానంగా భారతీయ కంపెనీ ‘జియో’నుంచి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం ఎదురు లేకుండా అన్ని విధాలా దూసుకుపోతున్న జియోకు స్పాన్సర్‌షిప్‌ మొత్తం ఏ మాత్రం సమస్య కాకపోవచ్చు. ఐపీఎల్‌లో సగం జట్లకు అసోసియేట్‌ స్పాన్సర్‌గా ‘జియో’ ఇప్పటికే వ్యవహరిస్తోంది కాబట్టి లీగ్‌ కొత్త కాదు.

క్రికెట్‌తో ఇప్పటి వరకు ఎక్కడా జత కట్టని మరో ప్రముఖ సంస్థ ‘అమెజాన్‌’ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. అత్యంత ప్రజాదరణ ఉన్న ఆటతో అనుబంధం పెంచుకునేందుకు ఇది సరైన సమయంగా ‘అమెజాన్‌’ భావిస్తోంది. చివరగా ‘కోకాకోలా’ పేరు వినిపిస్తున్నా... మిగతా మూడింటితో పోలిస్తే ఈ సంస్థకు అవకాశాలు తక్కువ. తాజా సమాచారం ప్రకారం రూ. 250–300 కోట్లు స్పాన్సర్‌షిప్‌గా లభిస్తే చాలని బీసీసీఐ కోరుకుంటోంది. అసలు ఒప్పందంతో పోల్చకుండా వివో ఆఫర్‌ చేసినదాంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగని బోర్డు భావిస్తోంది. 

‘జట్టు’ కడుతున్నారు... 
ముంబై: యూఏఈ గడ్డపై ఐపీఎల్‌ సీజన్‌కు రంగం సిద్ధం కావడంతో ఫ్రాంచైజీలు కూడా తమ తమ సేనల్ని సమాయత్తం చేస్తున్నాయి. ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇప్పటికే బోర్డు ఇచ్చే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ముసాయిదాపై చర్చించుకున్నాయి. ఈ విషయంలో ముంబై ఇండియన్స్‌ అందరికంటే చురుగ్గా వ్యవహరిస్తోంది. నగరంలోని ఓ హోటల్‌ మొత్తాన్ని తీసుకున్న ఆ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లను క్వారంటీన్‌ చేసే పనిలో పడింది. కోవిడ్‌ టెస్టులు కూడా నిర్వహించి ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది.

పరీక్షా ఫలితాలు, క్వారంటీన్‌ ముగిసిన వెంటనే నవీ ముంబైలో ఈ ఫ్రాంచైజీకి ఉన్న స్టేడియంలో శిక్షణ శిబిరం మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా త్వరలోనే తమ ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు చేసి రెండు వారాల్లో జట్టును సన్నద్ధం చేయాలని చూస్తోంది.  మరో వైపు ఆటగాళ్లు టోర్నీ, ఫ్రాంచైజీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి షూటింగ్‌లలో పాల్గొనాలన్నా కూడా మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి వుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement