Aus vs WI : శతక్కొట్టిన ట్రావిస్‌ హెడ్‌.. AUS vs WI, 1st Test: Travis Head Hammers His Second Test Century | Sakshi
Sakshi News home page

Aus vs WI : శతక్కొట్టిన ట్రావిస్‌ హెడ్‌..

Published Thu, Jan 18 2024 11:18 AM | Last Updated on Thu, Jan 18 2024 1:37 PM

AUS VS WI 1st Test: Travis Head Hammers His Second Test Century - Sakshi

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 95 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. ట్రావిస్‌ హెడ్‌ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి ఆలౌటైంది. హెడ్‌ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌పై సెంచరీ తర్వాత హెడ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో 15వ పరుగుతో​ హెడ్‌ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు.

ఉస్మాన్‌ ఖ్వాజా (45), నాథన్‌ లయోన్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టీవ్‌ స్మిత్‌ 12, లబూషేన్‌ 10, కెమరూన్‌ గ్రీన్‌ 14, మిచెల్‌ మార్ష్‌ 5, అలెక్స్‌ క్యారీ 15, మిచెల్‌ స్టార్క్‌ 10, పాట్‌ కమిన్స్‌ 12 స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. విండీస్‌ అరంగేట్రం పేసర్‌ షమార్‌ జోసఫ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేయగా.. కీమర్‌ రోచ్‌, మరో అరంగ్రేటం బౌలర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ తలో రెండు వికెట్లు, అ‍ల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం​ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌.. మూడో రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి 3 వికెట్లు కోల్పోయి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి, కష్టాల్లో చిక్కుకుంది. ఇంకా ఆ జట్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 88 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌, అలిక్‌ అథనాజ్‌ డకౌట్లు కాగా.. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ ఒక్క పరుగులు చేసి ఔటయ్యారు. కిర్క్‌ మెక్‌కెంజీ (5), కవెమ్‌ హాడ్జ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్‌ దారుణంగా దెబ్బతీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్‌ కోల్పోయిన మూడు వికెట్లు హాజిల్‌వుడే తీశాడు. అంతకుముందు విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లోనూ హాజిల్‌వుడే (4/44) దెబ్బకొట్టాడు. హాజిల్‌, కమిన్స్‌​ (4/41) ధాటికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కిర్క్‌ మెక్‌కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్‌ (13), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (6), అలిక్‌ అథనాజ్‌ (13), కవెమ్‌ హాడ్జ్‌ (12), జస్టిన్‌ గ్రీవ్స్‌ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్‌ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్‌ ఆటగాడు షమార్‌ జోసఫ్‌ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడి విండీస్‌ పరువు కాపాడాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement