బాబర్‌ విఫలం.. కమిన్స్‌ జోరు! రెండో రోజు ఆసీస్‌దే పైచేయి! | AUS vs PAK 2nd Test Day 2 Cummins Triggers Late Pak Collapse Aus Advantage | Sakshi
Sakshi News home page

AUS vs PAK: బాబర్‌ విఫలం.. కమిన్స్‌ జోరు! రెండో రోజు ఆసీస్‌దే పైచేయి!

Published Wed, Dec 27 2023 5:57 PM | Last Updated on Wed, Dec 27 2023 6:39 PM

AUS vs PAK 2nd Test Day 2 Cummins Triggers Late Pak Collapse Aus Advantage - Sakshi

Australia vs Pakistan, 2nd Test Day 2: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. కాగా మెల్‌బోర్న్‌ వేదికగా మంగళవారం ఆసీస్‌- పాకిస్తాన్‌ మధ్య బాక్సింగ్‌ డే టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. టీ విరామానికి 37 నిమిషాల ముందు వర్షం రావడంతో ఆటకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దాంతో తొలి రోజు 66 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి.

ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (38; 3 ఫోర్లు), ఉస్మాన్‌ ఖవాజా (42; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. స్టీవ్‌ స్మిత్‌ (26; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లబుషేన్‌ (44 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (9 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు. పాక్‌ బౌలర్లు హసన్‌ అలీ, ఆమెర్‌ జమాల్, ఆగా సల్మాన్‌ ఒక్కోవికెట్‌ తీశారు.

ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కంగారూ జట్టును పాక్‌ బౌలర్లు కట్టడి చేశారు. 187/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను 318 పరుగులకు ఆలౌట్‌ చేశారు. ఆతిథ్య ఆసీస్‌ రెండో రోజు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ జోష్‌లో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు ఆసీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్‌  ఇమామ్‌ ఉల్‌ హక్‌ను అవుట్‌ చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ అర్ధ శతకం(62)తో మెరిశాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌(54)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్‌ కమిన్స్‌ షఫీక్‌ను, లియోన్‌ మసూద్‌ను అవుట్‌ చేసి ఈ జోడీని విడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లోనూ బాబర్‌ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు.

కమిన్స్‌ అద్భుత బంతితో బాబర్‌(1)ను బౌల్డ్‌ చేయగా.. సౌద్‌ షకీల్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్‌ హాజిల్‌వుడ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక మరోసారి బంతితో మ్యాజిక్‌ చేసిన కమిన్స్‌.. ఆగా సల్మాన్‌(9)ను అవుట్‌ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చింది.

మొత్తంగా 55 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్తాన్‌ 194 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 29, ఆమిర్‌ జమాల్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు మూడు, నాథన్‌ లియోన్‌కు రెండు, జోష్‌ హాజిల్‌వుడ్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement