Telangana News: చిన్నారి 'గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!
Sakshi News home page

చిన్నారి 'గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!

Published Thu, Sep 7 2023 2:46 AM | Last Updated on Thu, Sep 7 2023 10:46 AM

- - Sakshi

సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది.

పట్టణానికి చెందిన సురేశ్‌, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది.

ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ..
చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్‌ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఎలా పార్టిసిపేట్‌ చేయాలో ఆ ప్రొసీజర్‌ను యూట్యూబ్‌ ద్వారా తెలుసుకుంది.

వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కినట్లు చీఫ్‌ ఎడిటర్‌ డాక్టర్‌ బైస్వారూప్‌ రాయ్‌ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్‌, మెయిల్‌ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు (2023) పుస్తకం, మెడల్‌, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్‌కు పోస్ట్‌ ద్వారా పంపించారు.

పెద్ద కూతురు కూడా..
సురేష్‌, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్‌ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది.

టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చు..
పిల్లల్లో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్‌, కావ్య దంపతులు, హుస్నాబాద్‌

మంత్రి హరీశ్‌రావు అభినందన..
అరుషి గిన్నిస్‌ బుక్‌లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో మెడల్స్‌ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement