కేసీఆర్‌ తవ్వగా.. హరీశ్‌ ఎత్తగా.. | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ తవ్వగా.. హరీశ్‌ ఎత్తగా..

Published Thu, Jun 15 2023 7:56 AM | Last Updated on Thu, Jun 15 2023 12:32 PM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/లక్డీకాపూల్‌: ప్రతిష్టాత్మక నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (నిమ్స్‌) ప్రాంగణంలో ‘దశాబ్ది’ బ్లాక్‌ నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 11.44 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. సీఎం గడ్డపారతో తవ్వగా మంత్రి హరీశ్‌రావు పారతో మట్టిని ఎత్తారు. కేసీఆర్‌ చేతుల మీదుగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పునాదిరాళ్లను వేశారు.

అనంతరం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన వైద్యారోగ్య దినోత్సవ సభలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌ శర్మ, సోమేష్‌కుమార్‌, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ముఖ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, హైదరాబాద్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి, డాక్టర్‌ మార్త రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం రూపొందించిన తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నగరానికి చెందిన గర్భిణులు పార్వతమ్మ (ఉదయ్‌ నగర్‌ కాలనీ), ఫర్వీన్‌ (బాలానగర్‌), శిరీష (ఎన్‌బీటీనగర్‌), తేజస్వీ (ప్రతాప్‌నగర్‌), సుజాత (శ్రీరాంనగర్‌), రేణుక (అంబేడ్కర్‌నగర్‌)లకు కిట్లను ఆయన అందజేశారు.

అధునాతన చికిత్సలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిమ్స్‌: డైరెక్టర్‌ బీరప్ప
తెలంగాణ ఉద్యమానికి నిమ్స్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఉద్యమ నేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, చావు నోట్లో తలపెట్టిన సమయంలో నిమ్స్‌ తన వంతు సేవలు అందించింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో నిమ్స్‌లో 900 పడకలు ఉండేవి. ఆ తర్వాత 1,500 పడకలకు చేరాయి. చికిత్సలు 108 శాతం పెరిగాయి. బోధన సిబ్బంది సంఖ్య 111 నుంచి 306కు పెరిగింది. పీజీ సీట్లు 82 నుంచి 169కు చేరాయి. కొత్తగా ఆరు విభాగాలు అందుబాటులోకి వచ్చాయి.

ఆరోగ్యశ్రీలో అత్యధిక చికిత్సలు అందిస్తున్న సంస్థ నిమ్సే. అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. గుండె, కిడ్నీ, బోన్‌మ్యా రో, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. జీవితకాలం ఉచితంగా మందులు అందజేస్తున్నాం. తుంటి, కీళ్లు చికిత్సలు, గూని వంటి ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దక్షణాదిలో అత్యధికం. డయాలసిస్‌ సేవలు 30 వేల నుంచి 1.20 లక్షలకు చేరుకున్నాయి. ఆస్పత్రిలో నెలకు 1.50 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. డైరెక్టర్‌గా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను.

మేం కిట్లు పంచుతుంటే.. వాళ్లు తిట్లు పంచుతున్నారు: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌ నగరం ప్రస్తుతం వ్యాక్సిన్‌, ఫార్మా హబ్‌గా ఉంది. రాబోయే రోజుల్లో హెల్త్‌ హబ్‌గా మారబోతోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు వైద్య విద్య కోసం చైనా, రష్యా, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలకు వెళ్లేవారు. ప్రస్తుతం జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ వచ్చింది. గతంలో 2,853 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.

ప్రస్తుతం వాటి సంఖ్యను 8,340కి పెంచాం. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను కూడా 50 వేలకు పెంచాం. వచ్చే ఏడాది మరో ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించబోతున్నాం. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ సహా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, ఫార్మా, నర్సింగ్‌ వంటి అనుబంధ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు, రక్తహీనతతో బాధపడే గర్భిణులకు మేం కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌లు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తిట్లు పంచుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement