Yallareddy TRS Ex MLA Enugu Ravinder Reddy Meets Etela Rajender - Sakshi
Sakshi News home page

గులాబీ ముళ్లు: ఈటలతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు మంతనాలు!

Published Sat, May 8 2021 12:29 PM | Last Updated on Sat, May 8 2021 1:01 PM

Yella Reddy Former TRS MLA Enugu Ravinder Reddy Meet Etela Rajender - Sakshi

గులాబీ కోటలో కలకలం మొదలైంది. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తగిన గుర్తింపు దక్కని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మాజీ ఎమ్మెల్యే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది.  

సాక్షి, కామారెడ్డి:  టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఆయుధంగా మలచుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2008లో ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించారు. అప్పుడు రవీందర్‌రెడ్డి అధినేత చెప్పినట్లుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌గౌడ్‌ చేతిలో ఓటమి చెందారు. 2009 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఆయన గెలుపు తీరాలకు చేరారు. తెలంగాణ కోసం 2010లో మరోసారి ఎమ్మెల్యే పదవిని వీడారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీని ఓడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన రవీందర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు.  

సురేందర్‌ చేరికతో తగ్గిన ప్రాధాన్యత 
ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్‌ 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ రెండు గ్రూపులుగా విడిపోయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా సురేందర్‌కు ప్రాధాన్యత లభించడం, పార్టీ అధిష్టానం తనను పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారన్న ప్రచారం ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన రవీందర్‌రెడ్డికి అధిష్టానం నుంచి భరోసా దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మంత్రి హరీశ్‌రావు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న రవీందర్‌రెడ్డికి పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో పాటు తన క్యాడర్‌కు అన్యాయం జరుగుతోందంటూ పార్టీ నేతల దగ్గర పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  

ఈటల వెంటే..? 
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమయం నుంచి పార్టీ ముఖ్య నేతలందరితో సన్నిహిత సంబంధాలున్న ఏనుగు రవీందర్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈటల వెంట అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టినా, వేరే పార్టీలో చేరినా ఆయన వెంట నడవాలనే ఆలోచనతోనే ఈటలను కలిసినట్టు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన క్యాడర్‌ ఉంది. వారంతా ఆయన వెంటే నడుస్తారని తెలుస్తోంది. అప్పట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా తాను టీఆర్‌ఎస్‌ను వీడేదిలేదని పేర్కొన్నారు.

అయితే పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనలో ఉన్న రవీందర్‌రెడ్డి.. ఇప్పుడు ఈటల వెంట నడుస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఈటలను కలవడం అందుకు బలాన్ని చేకూర్చింది. రవీందర్‌రెడ్డి అనుచురులైతే తాడోపేడో తేల్చుకోవాలని కొంత కాలంగా ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పార్టీలో గుర్తింపు లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆయన అనుచరులు బాహాటంగానే పేర్కొంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా వారికి సభ్యత్వ నమోదు పుస్తకాలు అందకపోవడంతో సభ్యత్వం కూడా తీసుకోలేదని సమాచారం.  

జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వివిధ మండలాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది తమకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఉన్నారని తెలు స్తోంది. నామినేటెడ్‌ పదవులు లేకపోవడంతో పాటు రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు రాకపోవడంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. వారు రవీందర్‌రెడ్డి బాటలో నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో తొలి నాటి నుంచి పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వంలో çతగిన గుర్తింపు లభించలేదు. దీంతో వారంతా ఈటల వెంట నడిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 

చదవండి: ఈటలతో కాంగ్రెస్‌ నేత భేటీ, టీపీసీసీకి షాక్‌ తప్పదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement