వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..? | Who Is Next Leader In Vikarabad Kodangal | Sakshi
Sakshi News home page

వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..?

Published Sat, Aug 5 2023 12:00 PM | Last Updated on Thu, Aug 17 2023 1:02 PM

Vikarabad Kodangal  - Sakshi

కొడంగల్‌ నియోజకవర్గం

కొడంగల్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్‌ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని టిఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడంగల్‌లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రేవంత్‌ రెడ్డినియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన టిడిపి పక్షాన రెండుసార్లు ఎన్నికయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు.

టిడిపి వర్కింగ్‌ అద్యక్షుడుగా ఉంటూ, ఆ పార్టీని వదలి కాంగ్రెస్‌ ఐలో చేరి వర్కింగ్‌ అద్యక్షుడు అయ్యారు. నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డికి సోదరుడు అవుతారు. నరేంద్ర రెడ్డికి 80754 ఓట్లు రాగా, రేవంత్‌ రెడ్డికి 71435 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన బాలకిషోర్‌కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. కాగా రేవంత్‌ రెడ్డి 2019 లోక్‌ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. తదుపరి రేవంత్‌ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గంలో 2014లో  ఐదుసార్లు గెలిచిన సీనియర్‌ నేత  గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు.

2009లో కాంగ్రెస్‌ ఐ పక్షాన పోటీచేసిన గురునాధ రెడ్డి 2014లో  టిఆర్‌ఎస్‌లో చేరి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2014లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్‌.పి విఠల్‌రావు 36304ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రేవంత్‌రెడ్డి ఒకసారి శాసనస మండలికి కూడా ఎన్నికయ్యారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడికి అల్లుడు. కొడంగల్‌లో గురునాధ రెడ్డి ఐదుసార్లు 1978, 1983, 1989, 1999, 2004లలో గెలుపొందారు.  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, టిఆర్‌ఎస్‌ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు.

కొడంగల్‌లో నందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు టిడిపి తరుపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉపఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్య నారాయణ గెలిచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.అచ్యుతరెడ్డి కొడంగల్‌లో రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో ఇంతవరకు పన్నెండుసార్లు రెడ్లు గెలుపొందితే, నాలుగుసార్లు వైశ్య సామాజికవర్గం గెలవడం విశేషం. అచ్యుత్‌ రెడ్డి కొంతకాలం పి.వి.నరసింహారావు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కొడంగల్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement