Telangana BJP: ఆపరేషన్‌ ఆకర్ష్ స్పీడ్ పెంచాలి.. వాళ్లకే సీట్లివ్వండి! | Telangana BJP Leaders Meeting With High Command Operation Akarsh | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ఆకర్ష్ స్పీడ్ పెంచాలి.. బలమైన నేతలకు సీటు భరోసా.. రాష్ట్ర బీజేపీ నేతలతో అధిష్ఠానం

Published Thu, Dec 29 2022 8:08 AM | Last Updated on Thu, Dec 29 2022 8:08 AM

Telangana BJP Leaders Meeting With High Command Operation Akarsh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులున్నారని, ఆయా స్థానాల్లో వారికంటే బలమైనవారు పార్టీలోకి వచ్చే పక్షంలో వారికి సీటు కేటాయించడంపై స్పష్టమైన హామీ ఇవ్వండి..’ అంటూ బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి సూచించింది. మిగిలిన 40 స్థానాల్లోనూ ఇతర పార్టీలకు గట్టి పోటీనిచ్చేలా చూడాలని తెలిపింది. ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌' స్పీడ్‌ పెంచాలని ఆదేశించింది.

ప్రస్తుతం తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బయటపడుతున్న అసంతృప్తిని పార్టీకి అనుకూలంగా మలుచుకుంటూ ముందుకెళ్లాలని సూచించింది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పార్టీకి ఇంతకంటే అనుకూల వాతావరణం, అవకాశం మరోసారి రాదని స్పష్టం చేసింది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, సభ్యులు డీకే అరుణ, గరికపాటి మోహన్‌రావు తదితరులతో జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు.  

తగిన నేతల భరోసానివ్వండి... 
ఇతర పార్టీల నుంచి వచ్చేవారిలో బలమైన నేతలకు సీటు ఇచ్చే విషయంపై వారికి విశ్వాసం కల్పించాలని, అయితే పలానా సీటిస్తామని మాత్రం ముందుగానే ప్రకటించలేమని బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తమతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల గురించి ఈటల వివరించినట్టు సమాచారం. దాదాపు 15 నుంచి 20 మంది దాకా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయిల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పినట్టు తెలిసింది.

అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా, టీపీసీసీలో వివిధ హోదాలు, పదవుల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు బీజేపీలోకి రాలేమని, కొంతకాలం వేచి చూస్తామంటూ కొందరు ముఖ్య నేతలు చెబుతున్నట్టు సమాచారం. కొందరు నేతలు తమకు పలానా ఎంపీ, అసెంబ్లీ సీటు ఖరారు చేయాలంటూ ముందుగానే కండిషన్లు పెడుతున్నారని రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులకు చెప్పారు.  

గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతోంది
రాబోయే రోజుల్లో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతోందని పార్టీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ తెలిపారు. బుధవారం రాత్రి ఓ రిసార్ట్‌ వద్ద ఈటల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిందని అన్నారు.
చదవండి: 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement