వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ targeted campaign against AAP on corruption allegations ensures clean sweep for BJP in Delhi | Sakshi
Sakshi News home page

వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌

Published Wed, Jun 5 2024 4:36 AM | Last Updated on Wed, Jun 5 2024 4:37 AM

targeted campaign against AAP on corruption allegations ensures clean sweep for BJP in Delhi

ఫలించని ఇండియా కూటమి ప్రయత్నాలు

జైలు పాలైనా కేజ్రీవాల్‌కు రాని సానుభూతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ను సాధించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏడింటినీ గెలుచుకుంది. జైలు నుంచి వచ్చి ప్రచారం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సానుభూతితో ఓట్లు తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. 2009లో ఢిల్లీలో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ 2014, 2019తోపాటు ప్రస్తుత ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ గెలిచి సత్తా చాటింది.

ఓట్లు రాబట్టని ప్రసంగం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఇండియా కూటమిని గెలిపిస్తే కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదంటూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నించారు. ప్రతిచోటా ఇదే ప్రసంగంతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, అవి ఫలించలేదు.

తగ్గిన బీజేపీ ఓటింగ్‌ శాతం
వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీలో బీజేపీ తన అధిపత్యాన్ని కనబరిచింది. 2009 ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 35.23% ఓట్లు తెచ్చుకుంది. 2014లో 46.40శాతం, 2019లో 56.85 శాతం ఓట్లతో వరుసగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో మాత్రం బీజేపీ 54.30 శాతం ఓట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో బీజేపీ 2.55శాతం ఓట్లను కోల్పోయింది. 

డీలా పడ్డ కాంగ్రెస్‌ గ్రాఫ్‌
2009 ఎన్నికల్లో 57.11 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ ఏడు స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచిన కాంగ్రెస్, 2014కు వచ్చేసరికి ఓటమిని చవి చూసింది. కేవలం 15.10% ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ 2019 ఎన్నికల్లో 22.63% ఓట్లతో పుంజుకుంది. తాజా ఎన్నికల్లో 19.11% ఓట్లతో తృతీయ స్థానానికి చేరింది. ఇక 24.02% ఓట్లతో ఆప్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ రెండు పార్టీలు ఓట్ల శాతాన్ని పెంచుకున్నా సీట్ల సాధనలో విఫలమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement