సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి Sajjala Ramakrishna Reddy About YSRCP Victory | Sakshi
Sakshi News home page

సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి

Published Tue, Jun 4 2024 3:16 AM | Last Updated on Tue, Jun 4 2024 4:20 AM

Sajjala Ramakrishna Reddy About YSRCP Victory

వైఎస్సార్‌సీపీ ఘన విజయం ఖాయం

పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల పిలుపు 

ఎన్నికల సంఘాన్ని మేనేజ్‌ చేసి అధికారులను భయపెట్టాలని చంద్రబాబు ప్రయత్నం 

అందుకే కౌంటింగ్‌ సమయంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు దిశానిర్దేశం 

గెలుపొందినట్లు డిక్లరేషన్‌ ఫారం ఇచ్చాకే కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెలుపలికి రావాలని సూచన 

కళ్లెదుట ఘోర పరాజయం కన్పిస్తోంది కాబట్టే చంద్రబాబు మౌనం 

పోస్టల్‌ బ్యాలెట్లపై దేశవ్యాప్తంగా ఒక రూల్‌.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయం? 

ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా వంటి జాతీయ మీడియా ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి జనం నవ్వుకుంటున్నారు 

టీడీపీ–జనసేన–బీజేపీలకు వచ్చే సీట్లు, ఓట్ల శాతమే ఇందుకు నిదర్శనం  

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇండియా టుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ బోగస్‌ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించేదే కాదన్నారు.

స్కిల్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్‌ నౌ, దైనిక్‌ భాస్కర్‌ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్‌సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థకి  వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్‌ పూర్తయి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ తీసుకునే వరకు కౌంటింగ్‌ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు.  

టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులు
ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్‌ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయ­మంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.

తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయ­త్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయ­పడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమ­యంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని  గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి
⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి 
⇒ కౌంటింగ్‌ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం  
‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్‌ జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.

ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్‌ హాల్‌ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్‌లో కౌంటింగ్‌ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఖచ్చితంగా కౌంట్‌ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్‌లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్‌ పూర్తయి డిక్లరేషన్‌ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్‌ ఏజెంట్లతో జూమ్‌ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement