ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఎన్నికల్లో విజయం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు | Rahul Gandhi Joins EVM Debate After Elon Musk Tweet | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఎన్నికల్లో విజయం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Published Sun, Jun 16 2024 4:00 PM

Rahul Gandhi Joins EVM Debate After Elon Musk Tweet

న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్‌ ఎలోన్‌ మస్క్‌ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్‌ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరోక్షంగా స్పందించారు.  

 

 

దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్‌ చేశారు.

ఫోన్‌తో ఈవీఎంను అన్‌ల్యాక్‌ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!

ముంబై నార్త్‌ వెస్ట్‌ లోక్‌సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్‌ లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్‌ 4న రెస్కో పోలింగ్‌ కౌంటింగ్‌ సెంటర్‌ బయట ఎంపీ రవీంద్ర వైకర్‌ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్‌ వినియోగించారు. ఆ ఫోన్‌ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్‌ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కౌంటింగ్‌ సెంటర్‌లో ఉన్న ఈవీఎం మెషిన్‌కు మంగేష్‌ పన్హాల్కర్‌కు ఫోన్‌కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్‌లో ఓటీపీ సాయంతో కౌంటింగ్‌ సెంటర్‌లో ఉన్న ఈవీఎం మెషిన్‌ ఓపెన్‌ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్‌  ఫన్హాల్కర్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.  

ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. భారత్‌లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్‌ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్‌ను వినియోగించలేరని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement