కాంగ్రెస్‌ మోసానికి చిరునామా! : మాయావతి | Political Comments By Mayawati, Yogi Adityanath, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఒవైసీ సవాలుకు మేము సిద్ధం: యోగి

Published Mon, Jul 5 2021 1:04 AM | Last Updated on Mon, Jul 5 2021 9:00 AM

Political Comments By Mayawati, Yogi Adityanath, Rahul Gandhi - Sakshi

కాంగ్రెస్‌ మోసానికి చిరునామా! 
కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసానికి చిరునామా అని బీఎస్‌పీ నేత మాయావతి తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో మాయావతి రహస్య ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘బీఎస్‌పీలో బీ అంటే బీజేపీ’’ అని యూపీ కాంగ్రెస్‌ ఒక ట్వీట్‌లో విమర్శించింది. దీనిపై మాయావతి పలు ట్వీట్లతో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు యూపీలో అడ్రస్‌ లేదని, కాంగ్రెస్‌ విమర్శలు అభ్యంతర కరమని, బీఎస్‌పీలో బీ అంటే బహుజనులని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో సీ అంటేనే కన్నింగ్‌ అని విమర్శించారు. బహుజనుల ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంతరం వారిని వదిలేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. అయితే బీజేపీకి బీఎస్‌పీ బీటీమ్‌ అని రాష్ట్రంలో అందరికీ తెలుసని, ఇప్పటికైనా మాయావతి నిజాలను ఒప్పుకోవాలని యూపీ కాంగ్రెస్‌ నేత అశోక్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు.

బీజేపీ– శివ సేన శత్రువులు కావు! 
కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలున్నంత మాత్రాన తమ పార్టీ, తమ మాజీ నేస్తం శివసేన శత్రువులు కావని బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నావీస్‌ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అది జరగవచ్చు, ఇది జరగకూడదని లేదన్నారు. భవిష్యత్‌లో ఇరువురూ మరలా కలుస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, సరైన సమయంలో, పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలుంటాయన్నారు. 2019 ఎన్నికల్లో తమతో కలిసే సేన పోటీ చేసిందని, కానీ ఫలితాల అనంతరం వేరేవారితో(ఎన్‌సీపీ, కాంగ్రెస్‌) చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. ఎవరిపైన పోటీ పడిందో వారితోనే సేన జట్టుకట్టిందని రాష్ట్ర అసెంబ్లీ సెషన్‌ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో పలు కేసులను దర్యాప్తు చేస్తున్నాయని, వీటిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. 

 ఒవైసీ సవాలుకు మేము సిద్ధం: యోగి
ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయబోమంటూ ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. 2022 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనీ, దీనిపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు. ‘ఒవైసీ ప్రముఖ జాతీయ నేత. ఆయన దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆయనకు సొంత ఆదరణ ఉంది. బీజేపీని ఆయన సవాల్‌ చేస్తే స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుంది. దీనిపై సందేహమే లేదు’అని ఆయన అన్నారు. అంతకు ముందు ఒవైసీ ‘యూపీలో మరోసారి యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం కానివ్వబోం. మేం కష్టపడితే, ప్రతి ఒక్కటీ సాధ్యమే. మా ప్రయత్నం సఫలమైతే యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు’అని అన్నట్లు వార్తలొచ్చాయి.

రఫేల్‌ డీల్‌పై రాహుల్‌ విమర్శలు
రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలంటూ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ..ఆదివారం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించింది. జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ ఆపార్టీ నేత రాహుల్‌ గాంధీ ఆన్‌లైన్‌లో సర్వే చేపట్టారు. ఈ ప్రశ్నకు రాహుల్‌ నాలుగు ఆప్షన్లు ఉంచారు.

వాళ్లకు కమీషన్‌ అందలేదనే.. 
రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. భారత వైమానిక దళం బలం క్షీణించినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్ల అవసరాలకు అనుగుణంగా విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించింది. ఆశించినంత మేర కమీషన్‌ గాంధీ కుటుంబానికి అందకపోవడమే కారణమా? అని బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్ర నిలదీశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement