కాటిపల్లి..కామారెడ్డి డబుల్‌ జెయింట్‌ కిల్లర్‌..! | Kamareddy Candidate Emerged As Double Giant Killer | Sakshi
Sakshi News home page

Telangana Election Results: ఒకే దెబ్బకు..ఇద్దరు బడా నేతలు

Published Sun, Dec 3 2023 7:28 PM | Last Updated on Sun, Dec 3 2023 8:10 PM

Kamareddy Candidate Emerged As Double Giant Killer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పైచేయి సాధించారు. అయితే కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలు ఇద్దిరినీ ఓడించిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డబుల్‌ జెయింట్‌ కిల్లర్‌గా అవతరించారు. కామారెడ్డిలో పోటీచేసిన ఇరు పార్టీల అధినేతలపై సంచలన విజయం సాధించి వెంకటరమణారెడ్డి పాపులర్‌ అయ్యారు. 

కామారెడ్డిలో ఎవరికి ఎన్ని ఓట్లు...

ఆదివారం ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచి కామారెడ్డి ఫలితం రౌండ్‌ రౌండ్‌కు తీవ్ర ఉత్కంఠ రేపింది. తొలుత ఈ స్థానంలో వెంకటరమణారెడ్డి లీడ్‌లో ఉండగా తర్వాత రేవంత్‌రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. చివరి రౌండ్లు లెక్కబెట్టే టైమ్‌కు రేవంత్‌రెడ్డిని వెనక్కి నెట్టేసి మళ్లీ వెంకటరమణారెడ్డి లీడ్‌లోకివచ్చారు. తర్వాత ఒక్కసారిగా కేసీఆర్‌ ముందుకు దూసుకువచ్చి రేవంత్‌ను మూడో స్థానానికి నెట్టారు. చివరగా కౌంటింగ్‌ ముగిశాక కేసీఆర్‌పై వెంకటరమణారెడ్డి 6741 వేల ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డికి 66652 ఓట్లు రాగా, రెండవ స్థానంలో ఉన్న కేసీఆర్‌కు 59911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి.

బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి.. 

ఒకప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న వెంకటరమణారెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.ఈ ఎన్నికల్లో టికెట్‌ రాకముందు నుంచే ఆయనే బీజేపీ పార్టీ అభ్యర్థి అని కన్ఫామ్‌ అయిపోయింది. అయితే తర్వాత నియోజకవర్గానికి ఏకంగా ఇటు కేసీఆర్‌, అటు రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. దీంతో వెంకటరమణారెడ్డిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఎక్కడా కుంగిపోకుండా, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో వెంకటరమణారెడ్డి తన ప్రచారం చేసుకుంటూ వెళ్లారు.

పనిచేసిన లోకల్‌ కార్డు..

ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా లోకల్‌ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రచారంలో వాడి వేడి డైలాగులు ప్రయోగించారు. ‘గజ్వేల్‌ డిపో నుంచి వచ్చిన బస్సులు గజ్వేల్‌కు, కొడంగల్‌ నుంచి వచ్చిన బస్సులు కొడంగల్‌కు వెళ్లిపోతాయి. కామారెడ్డి డిపో బస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి’ అని తాను స్థానికుడిని అని పరోక్షంగా చెప్పేలా ప్రచారం చేశారు.

వెంకటరమణారెడ్డి చెప్పిన ఈ మాటలు  అక్కడి ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్‌,రేవంత్‌రెడ్డిలలో ఎవరు గెలిచినా నియోజకవర్గంలో ఉండరని కామారెడ్డి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇదే ఆయన ఇద్దరు బడా నేతలపై విజయానికి కారణమైందని పొలిటికల్‌ అనలిస్టులు అభిపప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్‌ఎస్‌ తరపున గంప గోవర్ధన్‌ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement