KTR Support to Vizag steel plant protest | నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్‌ఈఎల్‌.. ఎల్లుండి సింగరేణి - Sakshi
Sakshi News home page

నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్‌ఈఎల్‌.. ఎల్లుండి సింగరేణి

Published Thu, Mar 11 2021 1:28 AM | Last Updated on Thu, Mar 11 2021 9:17 AM

If Silent All Will Be Sold Says TS Minister KTR Counter To Central Govt - Sakshi

బంజారాహిల్స్ (హైదరాబాద్‌)‌: నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్‌ఈఎల్‌.. ఎల్లుండి సింగరేణి.. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ అమ్మకానికి పెడుతుందని, భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ సర్కార్‌ ప్రైవేట్‌పరం చేసేలా ఉందని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం 100 శాతం అమ్మే ప్రయత్నం చేస్తోందని, తాము అక్కడి ప్రజలకు అండగా ఉంటామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి తీసుకొని విశాఖకు వెళ్లి మద్దతు తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్‌ హాజరై.. మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా చేపట్టిన ఉక్కు ఉద్యమానికి నైతికంగా సంఘీభావం పలుకుతామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే ఏపీ ప్రజలు కూడా మాతో కలిసి రావాలని కోరారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారన్నారు. అన్నీ అమ్మిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేయండని అంటారని ఆరోపించారు.



కేంద్రం ఇచ్చింది సున్నా..
తెలంగాణలోని బయ్యారంలో సెయిల్‌ ద్వారా ఉక్కు కర్మాగారం స్థాపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కేంద్ర పెద్దలు.. విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు నోరు ఎందుకు మెదపడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో లెక్కలతో సహా చూపించామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నేతలను పట్టభద్రులు గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ విద్యాసంస్థలు, కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ప్లాంట్, ట్రైబల్‌ వర్సిటీ, ఇలా ఎన్నో అడగడంతోపాటు లేఖలు రాసినా.. చివరికి కేంద్రం చేసింది గుండు సున్నా అని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టండి..
రాష్ట్రంలో 15 వేల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. విదేశాల్లో చదువు కోసం పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. నగరంలో 350 బస్తీ దవాఖానాలు, 25 డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 650 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిది ప్రశ్నించే గొంతు కాదని.. పరిష్కరించే గొంతు అవుతుందన్నారు. ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య అసోసియేషన్‌ వాణీదేవికి మద్దతు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement