నూతన ఏడాదికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Wished People To New Year | Sakshi
Sakshi News home page

నూతన ఏడాదికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

Published Sun, Dec 31 2023 7:41 PM | Last Updated on Sun, Dec 31 2023 7:46 PM

CM Revanth Reddy Wished People To New Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ‘రైతు మహిళ యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని రేవంత్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్‌ వెల్లడించారు. 

కాగా, కొత్త ఏడాది సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..‘మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్దరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష.

యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి.. వారి భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరం 'రైతు మహిళ యువత నామ సంవత్సరం'గా సంకల్పం తీసుకున్నాం. గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించాం. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. 

ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం. ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. 

అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గత పాలన కాదు.. జన పాలన. ప్రతీ పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. 

ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా.. అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ.. ఈ నూతన సంవత్సరంలో ప్రతీ పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతీ గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి. ప్రతీ ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement