175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో మొత్తం గెలుద్దాం: సీఎం జగన్‌ | CM YS Jagan Speech Highlights At YSRCP Leaders Memu Siddham Maa Booth Siddham Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

YSRCP Party Meeting Highlights: 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో మొత్తం గెలుద్దాం

Published Wed, Feb 28 2024 4:25 AM | Last Updated on Wed, Feb 28 2024 9:45 AM

CM Jagan Comments At Memu Siddham Maa Booth Siddham Meeting - Sakshi

‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’లో సీఎం జగన్‌ దిశానిర్దేశం 

మీ చేతికి.. ‘మంచి’ ఆయుధాలిచ్చా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు మేలు చేశాం 

99 శాతం హామీలను అమలు చేశాం.. విశ్వసనీయత చాటుకున్న పార్టీ మనదే 

175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో మనం గెలవాల్సిందే 

రానున్న 45 రోజులూ రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి.. మంచి చేసి ఓటు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ప్రతి ఇంటికీ వెళ్లండి 

ప్రజలకు వివరించి అత్యధిక మెజారిటీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే  

ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజారిటీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజారిటీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమైనా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు? పేదవాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్‌సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ‘మంచి’ ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి.  
 – వైఎస్సార్‌సీపీ నాయకులతో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.  గత 57 నెలలుగా లంచాలు, వివక్షకు తావులేకుండా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ చేతుల్లో పెట్టా. ఇప్పటికే మన పార్టీ టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లండి. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ఇంటింటికీ వెళ్లండి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే’ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం సాధించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికీ మంచి చేసిన నేపథ్యంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ గెలవాల్సిందేనని శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో మంగళవారం సీఎం జగన్‌ కీలక సమావేశాన్ని నిర్వహించారు. 175 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

విశ్వసనీయతే మన బలం..
రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లి అడిగినా విశ్వసనీయత ఉన్న పార్టీ ఏదంటే ఒక్క వైఎస్సార్‌సీపీనే అనే మాట వినపడుతుంది. ఒక పార్టీకి, రాజకీయ నాయకుడికి ఇది చాలా చాలా అవసరం. బహుశా దేశ రాజకీయాల్లో ఇలాంటి గౌరవం ఒక్క వైఎస్సార్‌సీపీకే దక్కింది. ప్రతి కార్యకర్త తమ నాయకుడిని చూపించి కాలర్‌ ఎగరేసే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం లభిస్తుంది. పార్టీ నాయకుడు కూడా అలాగే వ్యవహరించాలి. విశ్వసనీయతే మన బలం.



మనం కూడా అలాంటి వాగ్దానాలిద్దామన్నారు!
2014లో చంద్రబాబు 650 పేజీలతో మేనిఫెస్టో తెచ్చి అందరినీ మోసగించారు. అసాధ్యమని తెలిసినా రైతన్నలకు రూ.87,612 కోట్లు రుణమాఫీ మొదట సంతకంతోనే చేస్తానని నమ్మబలికారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. దాదాపు రూ.15 వేల కోట్ల పొదుపు సంఘాల రుణాలనూ మాఫీ చేస్తానన్నాడు. ఇంటింటికీ ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని అన్నాడు. అప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు మనం కూడా అలాంటి వాగ్దానాలు ఇద్దామన్నారు. ఇప్పుడు హామీలిచ్చి ఎన్నికలు అయిపోయిన తరువాత చూద్దామన్నారు.

ఒకవైపు చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుంటే మనం నీతిగా, నిజాయితీగా యుద్ధం చేయడం కుదరదని నాకు సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక్కటే అన్నాను. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్ధం చెబుతూ మనం చేయగలిగిందే చెబుదామని సూచించా. ఒక పని చేయలేమని తెలిసినప్పుడు మన నోటి నుంచి ఆ మాట రాకూడదని చెప్పా. నాడు ఆ మోసాలకు తోడు ప్రధాని మోదీ గాలి వీస్తుండటంతో దత్తపుత్రుడి సహకారంతో చంద్రబాబు గద్దెనెక్కారు. మోసం చేసి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్ట పాలు చేశారు. వెబ్‌సైట్‌ నుంచి కూడా మాయం చేశారు. మోసం ఎల్లప్పుడూ నిలబడదు. చివరకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే టీడీపీ తరపున గ్రామాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆ పార్టీ క్యాడర్‌ సాహసించలేదు. 

99 % హామీలు అమలు చేశాం
2019లో మనం కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. రెండు పేజీలు ఎందుకంటే ఆ మేనిఫోస్టో ప్రజలకు గుర్తుండాలి. అధికారంలోకి వచ్చాక మనకూ గుర్తుండాలి. నాడు మేనిఫెస్టో అంశాల గురించి చర్చిస్తుంటే విజయనగరం జిల్లాలో అప్పల నరసయ్య ఇవన్నీ సాధ్యమేనా? అని నాతో అన్నారు. ఇవన్నీ కచ్చితంగా చేసి తీరుతామని చెప్పా. అన్నీ ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకున్నాం.  ప్రతిమాట నెరవేరుస్తానని చెప్పా. చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా 151 స్ధానాలతో అధికారంలోకి వచ్చాం. 22 ఎంపీ స్ధానాలు గెల్చుకున్నాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాం, మీరే చూసి టిక్కు పెట్టాలని ప్రతి ఇంటికీ వెళ్లి చిత్తశుద్ధితో అడుగుతున్నాం. 

నాడు నవ్వుకుని ఉంటారు.. మనం సాధ్యం చేశాం
57 నెలల కాలంలో పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. ఇన్ని వందల కోట్లు,  ప్రతి ఇంటికీ రూ.లక్షలు ఇవ్వడం.. అది కూడా పారదర్శకంగా అందించడం సాధ్యమేనా? అని గత ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే చాలా మంది నవ్వుకుని ఉంటారు. అయితే అది సాధ్యమేనని మనం వచ్చాక చూపించగలిగాం. గ్రామాల్లో స్కూళ్లు మారాయి. ఊహకు కూడా అందని విధంగా ఇంగ్లీషు మీడియం చదువులు, ట్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లలో డిజిటల్‌ బోధన తీసుకొచ్చాం. ప్రతి పేద బిడ్డకూ నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం మనదే.

పొరపాటు జరిగితే మళ్లీ అరాచకమే
ఎవరైనా పొరపాటున వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకపోతే మళ్లీ జన్మభూమి కమిటీలు సంతకం పెట్టినట్టే. ఇంటివద్దే పారదర్శకంగా అందిస్తున్న పథకాలన్నీ వద్దని మనంతట మనం సంతకం పెట్టినట్టే. పొరపాటు చేస్తే పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఎక్కడా ఉండదు. మళ్లీ పేదవాడి బతుకు చిన్నాభిన్నమే అవుతుందనే సంకేతం ప్రతి గడపకూ చేరవేయాలి. అమ్మా..! జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడు. చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు.

చేయగలిగింది మాత్రమే చెబుతాడు. కానీ చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఆయన ఏమైనా చెబుతాడు. అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తాడన్నది మన కళ్లెదుటే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం. దానికన్నా మందు కూడా అదే చూశాం. ఇవాళ కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్‌ కారు కొనిస్తానంటున్నాడు. పొరపాటు చేస్తే మళ్లీ అరాచకం వస్తుందని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి.

సచివాలయం యూనిట్‌గా..
ప్రతి గ్రామంలో బూత్‌ స్ధాయిలో మన ఆర్గనైజేషన్‌ ఎలా ఉందన్నది ఎమ్మెల్యేలు పరిశీలించాలి. నియోజ­కవర్గస్ధాయి, మండలస్థ్ధాయి నుంచి అన్ని కమిటీలను అసెస్‌ చేసుకోవాలి. మీ అందరికీ ఒక్కటే సలహా ఇస్తున్నా. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోండి. మీకు కళ్లు, చెవులుగా వ్యవహరించే అత్యంత నమ్మకమైన వ్యక్తులను గుర్తించి ఈ నెలన్నర రోజులు అక్కడే పెట్టండి. ఆ సచివాలయం పరిధిలోని కేడర్, అభిమానులు, వలంటీర్లను వారు మీకు దగ్గర చేయాలి. అది మీరు రెగ్యులర్‌గా పర్యవేక్షించాలి. ప్రతి నియోజకవర్గంలో 80 సచివా­లయాలు ఉంటాయి. వాళ్లకు మీ ఫోన్‌ అందుబా­టులో ఉండాలి.

వాళ్లు ఏ సచివాలయంలోనైనా, ఎక్కడైనా గ్యాప్‌ కనిపిస్తున్నట్లు గుర్తిస్తే ఎప్పుడు ఫోన్‌ చేసినా మీరంతా రిసీవ్‌ చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి. సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని, ప్రతి వలంటీర్, కేడర్‌లో ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే అభ్యర్ధికి దగ్గర కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు సచివాలయంలో పెట్టిన వ్యక్తి ద్వారా బూత్‌ కమిటీల మీద ధ్యాస పెట్టండి. ప్రతి వలంటీర్‌కు అనుసంధానంగా గృహసారధులతో కలిసి బూత్‌ కమిటీ సభ్యులను నియమించాం. నలుగురు మనుషులు (ఒక బూత్‌ ఇన్‌ఛార్జి, ముగ్గురు కన్వీనర్లు) ఆ బూత్‌ కింద ఉన్న క్లస్టర్‌ను పర్యవేక్షించాలి. ఈ ఆర్గనైజేషన్‌ చాలా ముఖ్యం. దీన్ని గుర్తుపెట్టుకొండి. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి.

ఆర్గనైజేషన్‌ అత్యంత కీలకం..
మన పార్టీలో టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారు అయ్యాయి. మార్చాల్సినవన్నీ 95 శాతం మార్పు చేశాం. ఇంకా ఏదైనా ఒకటి అరా మాత్రమే ఉంటాయి. కచ్చితంగా ఆర్గనైజైషన్‌ మీద ధ్యాస పెట్టండి. ఇందులో మీరు విఫలమైతే ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే... ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇన్ని లక్షలు మీకు మంచి జరిగిందని ఏకంగా లెటర్లు తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఒక్క వైఎస్సార్‌ సీపీ మాత్రమే మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం కల్పి స్తోంది. కాబట్టి మీరు ఆర్గనైజేషన్‌ మీద ధ్యాస పెట్టిండి.

ప్రతి ఇంటికి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజార్టీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజార్టీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియో జకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమై నా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూ డదు? పేద వాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్‌ సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్ప గ లిగాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్‌ బలంపై ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సా హంతో, అంతే విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలి. మీ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ విషెష్‌..

క్లాస్‌ వార్‌..
ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్‌ వార్‌ అని గుర్తు పెట్టుకోండి. పేదవాడు ఒకవైపున.. పెత్తం­దార్లు మరొకవైపున నిలిచి యుద్ధం జరుగుతోంది. మీ జగన్‌ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్‌ ఉంటే లంచాలు, వివక్ష లేకుండా పథకాలు కొనసాగుతాయి. ఇంటికే వలంటీర్‌ వస్తాడు. అవ్వాతాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్‌ ఉంటేనే బడులు బాగుంటాయి. పేద బిడ్డలకు ఇంగ్లీషు మీడియం అందుతుంది. మీ జగన్‌ ఉంటేనే గ్రామాలలో విలేజ్‌ క్లినిక్‌లు పనిచేయడం కొనసాగుతుంది. విస్తరించిన ఆరోగ్యశ్రీ గొప్పగా సేవలు అందిస్తుంది. 

ఏ పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి కొనసా­గాలంటే జగన్‌ ఉంటేనే జరుగుతుంది. విద్య, వైద్యం, వ్యవ­సాయంలో ఎవరి ఊహకూ అందని మార్పులు తీసుకొచ్చాం. అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌తో భద్రత కల్పిస్తున్నాం. ఇవన్నీ కొనసాగాలంటే మీ జగన్‌తోనే సాధ్యమనే సందేశాన్ని అందరికీ చేరవేయాలి. 

కుప్పానికి రూ.1,400 కోట్లు.. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా 87 శాతం పైచిలుకు ఇళ్లకు మంచి చేయగలిగాం. కుప్పం గ్రామీణ నియోజవర్గం కాబట్టి అక్కడ  93.29 శాతం ఇళ్లకు మంచి చేయగలిగాం. నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా నేను కుప్పంలో చెప్పిన మాటలు వినకపోతే కచ్చితంగా యూట్యూబ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని వినండి. ఎందుకంటే కుప్పంలో నేను ప్రస్తావించిన అంశాలే ప్రతి నియోజకవర్గంలోనూ అవే మాదిరిగా పరిస్థితులున్నాయి. కుప్పంలో 87 వేల పైచిలుకు ఇళ్లు ఉంటే ఏకంగా 83 వేల ఇళ్లకు మంచి జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా మీ జగన్‌ బటన్‌ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తే అందులో రూ.1,400 కోట్లు కుప్పం నియోజకవర్గంలో 83 వేల ఇళ్లకు ఇవ్వగలిగాం. కుప్పంలో గతంలో 30 వేల ఇళ్లకు మాత్రమే పెన్షన్‌ వస్తుంటే మనం 45 వేల కుటుంబాలకు ఇస్తున్నాం. ఒక్క పెన్షన్లకే కుప్పంలో రూ.507 కోట్లు ఇచ్చాం. చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి కూడా అలాగే అందించాం. ఇళ్ల స్థ్ధలాలు 30 వేలకు పైగా కుటుంబాలకు అందుతున్నాయి. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాకుండా మనం అన్ని వందల కోట్లు ఇచ్చినప్పుడు ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఈ డేటా మీ అందరికీ అందుబాటులోకి ఉంది. 

వైఎస్సార్‌సీపీ గెలుపును ఏ శక్తులూ ఆపలేవు
నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలను ఎక్కడిక్కడ పరిష్కరిస్తున్నాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దగ్గరి నుంచి ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలు­పును ఏ శక్తులు ఆపలేవు. ఎంతమంది జతకట్టుకుని వచ్చినా సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ముందు నిలవలేరు. వీటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటు అతుకుల బొంతగా కనిపిస్తోంది. ఎన్నికలను ఎదుర్కోవడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.     
– ఆర్కే రోజా, మంత్రి

సీఎం జగన్‌ను వాళ్లు తట్టుకోలేరు..
అభ్యర్థులు మాకు దొరక్కపోవటం ఏమిటి? ప్రకటించకపోవటం ఏంటీ? చూస్తున్నారు గదా మా కోలాహలం.. వారు రా కదలిరా.. అంటే ప్రజలు ఎవ్వరూ రావటంలేదు. బాబు–పవన్‌లు సీట్లు ప్రకటించారు కదా? వారి పార్టీల్లో ఏం జరుగుతోందో చూస్తున్నారు కదా? కాపు సోదరులు, జనసేన కేడర్‌ పవన్‌ను సీఎం సీఎం అంటుంటే, పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం సీఎం అంటున్నారు. ప్యాకేజీ లేకుంటే ఎందుకు అంటారు. 
45 రోజులు వేచి చూస్తే సరి. సీఎం జగన్‌ ముందు వీళ్లు తట్టుకోలేరు. 
– అంబటి రాంబాబు, మంత్రి 

ఖాళీ బిందెలే సౌండ్‌ ఎక్కువ చేస్తాయి...
ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అనే దానిపై సీఎం జగన్‌ కొన్ని సూచనలు, సలహాలిచ్చారు. సమావేశం విజయవంతంగా జరిగింది. చాలామంచి సందేశం ఇచ్చారు. కేడర్‌లో నూతనోత్తేజం నెలకొంది. వైఎస్సార్‌సీపీ 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తుంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. పవన్, లోకేశ్, చంద్రబాబు ఆటలు సాగవు. ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు. విశ్వసనీయత ఉన్న పార్టీ వైఎస్సార్‌సీపీ అని ప్రజలు నమ్ముతున్నారు. టీడీపీ–జనసేన–కాంగ్రెస్‌–బీజేపీ తీరు ఖాళీ బిందెల టైపు అన్నట్లు ఉంది.    
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి

పవన్, బాబులకు ప్రజల్లో బలంలేదు
జనసేన–టీడీపీ పొత్తు హిట్‌ కాదు. వారికి ప్రజల్లో బలంలేదు. సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదిరించలేం అని తెలిసింది కాబట్టే వారు పొత్తులతో వస్తున్నారు. సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు ఒక్కటే చెబుతున్నారు.. మా కుటుంబాల్లో ఎప్పుడు ఇంత మార్పు రాలేదని.. మా కుటుంబాల్లో పెదరికం పోయిందంటున్నారు. కాబట్టి సీఎం జగనన్నకే మళ్లీ ఓటువేసి రెండోసారి ఆయన్ను సీఎంను చేసుకొంటాం అంటున్నారు. బాబు మోసాన్ని, జగన్‌ మంచిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గెలుపు ఖాయం.
– తానేటి వనిత, మంత్రి

99 శాతం హామీలు నెరవేర్చారు జగన్‌..
వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక 99 శాతం హామీలు నెరవేర్చారు. అందుకే ఈరోజు మా కార్యకర్తలు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. చంద్రబాబు 600 పైగా హామీలు ఇచ్చి అందులో 10 శాతం కూడా నెరవేర్చలేదు. అసలు మ్యానిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తీసేసిన చరిత్ర ఆయనది. డ్వాక్రా రుణమాఫీ, రైతు రూణమాఫీ, ఇంటికొక ఉద్యోగం.. నిరుద్యోగభృతి ఏదీ చేయలేదు. ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్తారు. ఈరోజు 

ఏం చేశామో చెప్పి 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నాం. సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన సాగించారు.     
– వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ

‘వైనాట్‌ 175’కు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ఏ ప్రభుత్వం కూడా ఇంత సంక్షేమం అందించలేదు. సీఎం జగన్‌ చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి మరో 24 అమలుచేశారు. సచివాలయంలో డిస్‌ప్లే బోర్డు చూస్తే వైఎస్సార్‌సీపీ ప్రజలకు ఏం చేసిందో తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన స్థితిగతులు మారాయి. నరసాపురం పార్లమెంట్‌ స్థానం గతంలో అగ్రవర్ణాల వారికి, ఆర్థికంగా బలమైన వారికే కేటాయించేవారు. ఇప్పుడు నాలాంటి బీసీ మహిళలను సీఎం జగన్‌ పోటీచేయిస్తు­న్నారు. ఇది కదా మహిళా సాధికారత. వైనాట్‌ 175 అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.    
– గూడూరు ఉమాబాల, వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement