బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో  సంబురాలు Celebrations At BJP State Office Over BC CM Announcement | Sakshi
Sakshi News home page

బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో  సంబురాలు

Published Sun, Oct 29 2023 4:04 AM | Last Updated on Sun, Oct 29 2023 4:04 AM

Celebrations At BJP State Office Over BC CM Announcement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని బీజేపీ అధిష్టానం చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు సంబురాలు జరిపారు. పార్టీ ఆఫీస్‌ బయట పటాసులు కాల్చి, డప్పులు వాయిస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పార్టీ నేతలు క్షీరాభిషేకం చేశారు.

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్, పార్టీ నేతలు ఆకుల విజయ, టి.వీరేందర్‌గౌడ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కె.లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌ షా ప్రకటన చరిత్రాత్మకమని అన్నారు.

రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌కు బీసీలంటే చిన్నచూపని ఆరోపించారు.

బీజేపీ 40 స్థానాలకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించబోతోందని, తెలంగాణ సమాజం నిండు మనస్సుతో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ... తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని అన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement