డామిట్‌! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్‌ | Bihar Politics: Nitish Kumar Elected As JDU President After Lalan Singh Resigns, See Details Inside - Sakshi
Sakshi News home page

Bihar Politics: డామిట్‌! కథ అడ్డం తిరిగింది

Published Sat, Dec 30 2023 5:04 AM | Last Updated on Sat, Dec 30 2023 10:00 AM

Bihar Politics: Nitish Kumar elected as JDU President after Lalan Singh resigns - Sakshi

న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్‌సింగ్‌ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్‌ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్‌ భేటీ ఇందుకు వేదికైంది.

పార్టీ అధ్యక్షునిగా నితీశ్‌ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్‌ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్‌ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్‌ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్‌ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్‌ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు!

కొద్ది నెలల క్రితం నుంచే...
ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్‌ లాలుప్రసాద్‌ యాదవ్‌తో లలన్‌సింగ్‌ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్‌ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్‌ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్‌ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్‌బంధన్‌ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

లాలు–లలన్‌ ప్లాన్‌
నితీశ్‌ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్‌ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్‌ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్‌ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు.

కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్‌ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్‌ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్‌ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది.

ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్‌ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్‌ అప్రమత్తమయ్యారు.

సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్‌ లాలన్‌’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్‌ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్‌ పేరును సూచించి తప్పుకున్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement