నీటిబొట్టు.. ఒడిసిపట్టు | - | Sakshi
Sakshi News home page

నీటిబొట్టు.. ఒడిసిపట్టు

Published Sat, Apr 20 2024 1:20 AM | Last Updated on Sat, Apr 20 2024 1:20 AM

- - Sakshi

● తాగునీటి అవసరాల కోసం బొగ్గు గనుల్లోని వృథా నీరు ● సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న అధికారులు

గోదావరిఖని: ‘నీటి బొట్టును వృథా చేయవద్దు.. ప్రతీచుక్కను ఒడిసి పట్టాలి.. బొగ్గు బావుల్లోంచి వచ్చే నీటిని ప్రజావసరాలకు మళ్లించాలి’ అని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ఇటీవల ఆదేశించారు. గోదావరినదిలో నీరు అడుగంటడంతో సింగరేణి బొగ్గు బావుల్లోంచి వెలువడే వృథా నీటిని శుద్ధి చేసి జిల్లావాసులకు అందించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పొంచి ఉన్న తాగునీటి ముప్పుపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోరెండు నెలలపాటు పట్టణాలు, గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టింది.

సింగరేణి అధికారులతో భేటీ..

వేసవిలో తలెత్తబోయే తాగునీటి ముప్పును అధిగమించేందుకు సింగరేణి బొగ్గు గనుల్లోంచి వెలువడే వృథా నీటిని వినియోగించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ నిర్ణయించారు. ఈమేరకు సింగరేణి అధికారులతో ఆయన ఇటీవల ఇదేవిషయంపై సమీక్షించారు. రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాల్లో ఉన్న గనుల్లోంచి ఎంత నీరు వెలువడుతోంది? యాజమాన్యం ఎంత వినియోగిస్తోంది? వృథాగా పోతున్నదెంత? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని మిషన్‌ భగీరధ అధికారులను ఆదేశించారు. గనుల్లోంచి రోజూ దాదాపు 132 ఎంఎల్‌డీ నీరు పంపింగ్‌ చేస్తున్నారు. ఇందులోంచి సింగరేణి అవసరాలకు పోను సుమారు 100 ఎంఎల్‌డీ నీటిని వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలోనే సమీప గ్రామాలు, పట్టణాలకు బొగ్గు గనుల నీరు మళ్లించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.

చెరువుల్లోకి వృథా నీరు..

● ప్రధానంగా ఆర్జీ–2, 3 ఏరియాల్లోని జల్లారం, బొక్కల వాగులో కలుస్తున్న వృథా నీటిపై అధికారులు దృష్టి సారించారు

● ఆర్జీ–1 నుంచి విడుదలయ్యే నీటిని ఎర్రచెరువు, నల్లచెరువులు, ఆర్జీ–2 నుంచి వెలువడే నీటిని జల్లారం వాగు, ఆర్జీ–3 నుంచి విడుదలయ్యే నీటిని బొక్కల వాగుకు మళ్లిస్తున్నారు.

● ఈనీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధికారులు దృష్టి సారించారు.

● వృథానీటిని ఆర్వోప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారానే తాగునీటిగా వినియోగించుకోవాలని సింగరేణి అధికారులు సూచించారు.

● తొలుత రామగుండం, పరిసర గ్రామాలకు ప్రజలకు తాగునీరు సరఫరా చేసే అంశంపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

● ఈ క్రమంలో అధికారులు ఈ రెండు ఏరియాల్లో పర్యటించారు.

సహకరిస్తాం

బొగ్గు గనుల్లోంచి వెలువడే వృథా నీటిని పంటలకు మళ్లిస్తున్నాం. ప్రధానంగా చెరువులు, కుంటల్లోకి మళ్లించి ప్రజావసరాలకు వినియోగిస్తున్నాం. ప్రస్తుతం యాసంగిసీజన్‌ పంటలకు నీటి అవసరం తీరింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని కలెక్టర్‌ ముజిమ్మల్‌ఖాన్‌ సూచించారు. ఈమేరకు మిషన్‌ భగీరధ అధికారులు ఏరియాలో పర్యటించి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. జిల్లావాసుల దాహం తీర్చేందుకు మాస్థాయిలో సహకరిస్తాం.

– శ్రీనివాస్‌, ఆర్జీ–1 జీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
బొగ్గుబావి నుంచి వస్తున్న వృథానీరు
1/2

బొగ్గుబావి నుంచి వస్తున్న వృథానీరు

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement