గర్భిణుల నమోదు త్వరగా జరగాలి | - | Sakshi
Sakshi News home page

గర్భిణుల నమోదు త్వరగా జరగాలి

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ   డాక్టర్‌ బి.జగన్నాథరావు
 - Sakshi

పార్వతీపురంటౌన్‌: గర్భిణుల నమోదు త్వరితగతిన జరగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు ఆదేశించారు. ఈ మేరకు పార్వతీపురం, గరుగుబిల్లి మండలాలకు చెందిన పీహెచ్‌సీల వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశాన్ని స్థానిక ఎన్‌జీఓ భవనంలో గురువారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణికి పూర్తిస్థాయిలో, కచ్చితమైన వైద్య సేవలందాలంటే క్షేత్రస్థాయిలో అర్హులైన జంటలను గుర్తించి, సకాలంలో గర్భనిర్ధారణ పరీక్షలు చేసి గర్భిణుల నమోదు (రిజిస్ట్రేషన్‌) త్వరగా మొదటి త్రైమాసంలోనే చేయాలని, అందుకు అవసరమైన పూర్తి వివరాలు మాతాశిశు సంరక్షణ కార్డులో పొందుపర్చాలని సూచించారు. తద్వారా ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షలు గర్భిణికి త్వరగా నిర్వహించి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే సత్వరమే గుర్తించవచ్చని, సరైన చికిత్స, పర్యవేక్షణ చేయడం ద్వారా హైరిస్క్‌ ఆరోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా గుర్తించిన గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజూ ఐరన్‌ ఫోలిక్‌ ఆసిడ్‌ మాత్రలు వేసుకునేలా పర్యవేక్షించాలని, అవసరమైన ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజక్షన్స్‌ ఇవ్వాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి అందజేస్తున్న పౌస్టికాహారం సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు.

ప్రిజం10 అమలు తీరును పర్యవేక్షించాలి

ప్రిజం10 అమలు తీరును పర్యవేక్షించాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌ఓ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహారలోపం, శ్వాస సంబంధ సమస్యలున్న వారిని త్వరగా గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయాలన్నారు. గ్రామాల్లో వడదెబ్బ, వేసవి జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ నారాయణరావు, డీఎంఓ డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు, ఆర్బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్‌.రఘుకుమార్‌, డాక్టర్‌ ఎం.వినోద్‌, డీపీహెచ్‌ఎన్‌ఓ ఉషారాణి, డీపీఓ లీలారాణి, ఎస్‌ఓ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.జగన్నాథరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement