సారాతో వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

సారాతో వ్యక్తి అరెస్టు

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

- - Sakshi

సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్‌ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్‌ పట్నాయక్‌, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్‌సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిపై కత్తితో దాడి

వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్‌ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్‌ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్‌ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్‌ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్‌ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోలీస్‌ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు

విజయనగరం క్రైమ్‌: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్‌ పోలీసులైన్స్‌లో నడపబడుతున్న పోలీస్‌ వెల్ఫేర్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్‌, ఫిజిక్స్‌ బయాలజీతో పాటూ ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, రెజ్యూమ్‌ తీసుకుని ఏప్రిల్‌ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్‌ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్‌లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు.

వెబ్‌సైట్‌లో డీఎడ్‌ హాల్‌టికెట్లు

విజయనగరం అర్బన్‌: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్‌ మూడవ సెమిస్టర్‌ (2022–24 బ్యాచ్‌ మరియు ఒన్స్‌ ఫైల్డ్‌), మొదటి సెమిస్టర్‌ (2023–25 బ్యాచ్‌ మరియు ఒన్స ఫైల్డ్‌) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరచామని డీఈఓ ఎన్‌.ప్రేమకుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

బాలికపై లైంగిక దాడి

డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాహనం ఢీకొని బాలుడి మృతి

రాజాం సిటీ : రాజాం పట్టణం చీపురుపల్లి రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లచ్చయ్యపేటకు చెందిన గొండేటి భరద్వాజ్‌(10) అనే బాలుడు మృతి చెందాడు. రాజాం వైపు వస్తున్న ఓ వాహనం టిఫిన్‌ నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన బాలుడిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ప్రైవేట్‌ వాహనంలో రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సను అందిస్తుండగానే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు సంతు, వెంకటేష్‌లు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజాం సీఐ మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎస్‌ఈబీ అధికారుల అదుపులో 
నిందితుడు, సారా ప్యాకెట్లు
1/1

ఎస్‌ఈబీ అధికారుల అదుపులో నిందితుడు, సారా ప్యాకెట్లు

Advertisement
 
Advertisement
 
Advertisement