ఆడాళ్లా మజాకా..! | - | Sakshi
Sakshi News home page

ఆడాళ్లా మజాకా..!

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

మార్ట్‌లో అందుబాటులో ఉన్న సరుకులు - Sakshi

వీరఘట్టం: మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న చర్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో ప్రారంభించిన వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌ ప్రగతి పథంలో నడుస్తోంది. జిల్లాలోని వీరఘట్టం మండల కేంద్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మార్ట్‌లో మార్కెట్‌ ధరల కంటే తక్కువకే నాణ్యమైన సరుకులను ప్రజలకు విక్రయిస్తుండడంతో ప్రారంభించిన మూడు నెలల్లోనే రూ.60 లక్షల వ్యాపారం జరిగింది. ఈ లెక్కన చూస్తే లాభాలు బాగా వచ్చే అవకాశం ఉందని మార్ట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. వీరఘట్టం పట్టణంలో తొలి మహిళా మార్ట్‌ను డ్వాక్రా సంఘాల సౌజన్యంతో ఈ ఏడాది జనవరి 12న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ప్రారంభించి ఆయనే మొదట కొనుగోలు చేశారు. ప్రారంభించిన రోజున కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఆకాంక్షించిన విధంగానే ఈ మార్ట్‌ వ్యాపారాభివృద్ధి చెందింది.

మార్ట్‌ ఏర్పాటు ఇలా..

వీరఘట్టం మండలంలోని 1600 మహిళా సంఘాల్లో ఉన్న 15 వేల మంది సభ్యులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున పెట్టుబడితో రూ.30 లక్షలు పోగు చేశారు. ఈ డబ్బుతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మరి కొన్ని కార్పొరేట్‌ కంపెనీల్లో సరుకులను మార్కెటింగ్‌ చేశారు. మరి కొన్ని సరుకులను హోల్‌సేల్‌ షాపుల్లో ఖరీదు చేశారు. ఇలా వివిధ రకాలుగా ఖరీదు చేసిన సరుకులను వీరఘట్టం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మార్ట్‌ ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో అటు డ్వాకా సంఘాల సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్‌లో సరుకులు కొనుగోలు చేస్తుండడంతో మార్ట్‌లో వ్యాపారం జోరందుకుంది.

60 శాతం లాభాలు పెట్టుబడి పెట్టిన మహిళలకే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన మహిళలకు 60 శాతం లాభాలను ఇవ్వనున్నారు. అలాగే 40 శాతం లాభాలను వ్యాపారాభివృద్ధికి పెట్టుబడి పెడతారు. ఈ వ్యాపారంలో కేవలం రూ.200 పెట్టుబడి పెట్టిన 15 వేల మంది మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. మరి కొద్దిరోజుల్లో వ్యాపారంలో వచ్చిన లాభాలను ఆయా సంఘాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. వీరఘట్టంలో పాటు గరుగుబిల్లి, సీతంపేట,జియ్యమ్మవలస,వంగర మండలాల ప్రజలు నిత్యం వస్తూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపూ ఈ మహిళా మార్ట్‌పైనే పడింది.

ప్రగతిపథంలో దూసుకుపోతున్న

మహిళా మార్ట్‌

ప్రారంభించిన మూడు నెలల్లో

రూ.60 లక్షల వ్యాపారం

రోజుకు రూ.60 వేల వ్యాపారం

మాకు తెలియని వ్యాపారం ఇది. అయినా సరే ప్రభుత్వం చొరవతో మార్ట్‌ ఏర్పాటు చేశాం. సరుకుల ధరలు ఎంతో తెలిసేవి కాదు.మహిళా సంఘాల సభ్యులందరి సహకారంతో సరుకులు విక్రయిస్తున్నాం.బయట నుంచి తెచ్చిన పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను గ్రేడింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేస్తున్నాం. షాపును అందంగా తీర్చిదిద్దడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బాగా వస్తున్నారు.ప్రస్తుతం రోజుకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వ్యాపారం జరుగుతోంది.

దాసరి పుణ్యవతి, అధ్యక్షురాలు, వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌, వీరఘట్టం

మూడు నెలల్లో రూ.60 లక్షల వ్యాపారం..

15 మంది మహిళా కమిటీ సభ్యులతో వీరఘట్టంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌ మూడు నెలల్లోనే రూ.60 లక్షల వ్యాపారం చేయడంపై అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎటువంటి వ్యాపార అనుభవం లేని వీరు ఇంత పెద్ద బాధ్యతను ఎలా చేపట్టగలరని తొలుత సందేహాలు వ్యక్తం చేసిన వారే ఇప్పుడు శభాష్‌ అంటున్నారు. జిల్లాలో మరికొన్ని మార్ట్‌ల ఏర్పాటుకు వీరఘట్టం మార్ట్‌ రోల్‌మోడల్‌గా మారిందని ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వీరఘట్టంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌
1/2

వీరఘట్టంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement