తానా ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’ | Literary Conference Under The Auspices Of Tana World Literary Forum | Sakshi
Sakshi News home page

తానా ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’

Published Mon, Feb 1 2021 8:15 PM | Last Updated on Mon, Feb 1 2021 8:25 PM

Literary Conference Under The Auspices Of Tana World Literary Forum - Sakshi

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ సాహిత్య సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో విశిష్ట అతిధులు విచ్చేసి ‘‘తారలు-రాతలు’’ అనే అంశంపై సినీ తారలుగా వెలుగొందుతూ మంచి సాహిత్యాన్నిసృష్టించిన సినిమా తారలు తనికెళ్ళ భరణి, డా. అక్కినేని నాగేశ్వర రావు, డా.పీ భానుమతి, డా. కొంగర జగయ్య, డా. గొల్లపూడి మారుతిరావుల రచనలను గుర్తు చేసుకున్నారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన ప్రారంభోపన్యాసంలో ఇది ఒక వినూత్న, విశిష్ట కార్యక్రమమని, సినిమా నటులుగా అందరికి పరిచయమైన వారి రచనలను సాహిత్య సమాలోచన జరపడం సముచితంగా ఉందన్నారు. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.. అగ్రశ్రేణి తారలైన వారిలో కొంతమంది నటులుగా రాణిస్తూనే తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగించడం, ఇప్పుడు దాన్ని చర్చించడం హర్షనీయమన్నారు. 

ప్రముఖ నాటక రచయిత, కథారచయిత, సంభాషణల రచయిత, సినీ నటుడు, దర్శకుడైన తనికెళ్ళ భరణి.. తాను విద్యార్ధి దశలో రాసిన “అద్దె కొంప, ఆ తర్వాతి కాలంలో రాసిన “గోగ్రహణం, “కోక్కరోకో, “గార్ధ భాండం, “చలచల్ గుర్రం, “జంబు ద్వీపం, “గొయ్య్ఙి మొదలైన నాటికలు రాసిన నేపథ్యాన్ని, ‘నక్షత్ర దర్శనం’, ‘పరికిణి’, ‘ఎందరో మహానుభావులు’ మొదలైన రచనలు ‘శభాష్ రా శంకరా’, ‘ఆటగదరా శివ’ లాంటి రచనల్లోంచి కొన్ని పద్యాలు పాడి అందరినీ పరవశింప చేశారు.

పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు రాసిన ‘అక్కినేని ఆలోచనలు’, ‘మనసులో మాట’ మొదలైన రచనల గురించి దాశరథి. సినారె లాంటి సాహితివేత్తలతో ఆయనకున్న సాహిత్యానుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, అయన సాహితీ ప్రస్థానాన్ని, అక్కినేని ఆత్మీయ సోదరిగా అభిమానం సంపాదించుకున్న డా. కేవీ కృష్ణ కుమారి సోదాహరణంగా వివరించారు. డా. పీ భానుమతి రాసిన ‘అత్తగారి కథలు’, ‘భానుమతి కథలు’, ‘నాలో నేను’ అనే తన ఆత్మ కథలోని విశేషాలు, చక్రపాణి గారితో ఆమెకున్న సాహిత్యానుబంధం, సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం లాంటి ఎన్నో విశేషాలను  డా. భానుమతితో పాతికేళ్ళ అనుబంధం ఉన్న ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శారదా అశోకవర్ధన్ ఎన్నో విశేషాలను ఆసక్తికరంగా పంచుకున్నారు.

కళావాచస్పతి డా. కొంగర జగ్గయ్య విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని రచనలను ‘రవీంద్రగీత’గా రాసిన తీరు, ‘మనస్విని’ అనే సాహితీ సంస్థ ద్వారా అచార్య ఆత్రేయ రచించిన సినీ గీతాలను ఏడు సంపుటాలుగా ప్రచురించడం, ఎన్నో సాహిత్య సమావేశాలను నిర్వహించడం, డా. జగయ్యతో తనకున్న ఎన్నో ఏళ్ల సాహిత్యనుబంధాన్ని ప్రఖ్యాత కవి, రచయిత రసరాజు ఎంతో ఆత్మీయంగా, రసరమ్యంగా పంచుకున్నారు.

డా. గొల్లపూడి మారుతీ రావు ఎంతో విస్తారంగా సృష్టించిన నాటికలు, నాటకాలు, నవలలు, కథా సంపుటాల పై ప్రముఖ కవి, కౌముది అంతర్జాల మాస పత్రిక వ్యవస్థాపకులు కిరణ్ ప్రభ డా. గొల్లపూడి రచనలపై ఎంతో లోతైన సమగ్ర సాహిత్య విశ్లేషణ చేశారు. ముఖ్యంగా డా. గొల్లపూడి రాసిన “సాయంకాలం అయింద్ఙి నవల, ఆత్మకధ “అమ్మ కడుపు చల్లగ్ఙా, “జీవన కాలమ్స్, ఆయన విశిష్ట రచనా శైలి, కౌముది మాస పత్రికతో డా. గొల్లపూడి కున్న సుదీర్ఘ సాహిత్యనుబంధాన్ని చక్కగా వివరించారు. డా. అక్కినేని నాగేశ్వర రావు, తనికెళ్ళ భరణి, డా. గొల్లపూడితో తనకున్న ప్రత్యేక ఆత్మీయ అనుభందం, ఎన్నోసార్లు కలిసి గడిపిన మధుర సంఘటనలను డా. ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకుని అది ఒక అరుదైన సువర్ణ అవకాశం అని అభిప్రాయ పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement