‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్‌’.. డీంఎంకే కొత్త ప్లాన్‌? | Tamil Nadu CM MK Stalin Lord Murugan move Against BJP Ayodhya Ram Mandir | Sakshi
Sakshi News home page

Lord Murugan Festival: ‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్‌’.. డీంఎంకే కొత్త ప్లాన్‌?

Published Wed, Mar 13 2024 1:12 PM | Last Updated on Wed, Mar 13 2024 3:17 PM

Tamil Nadu CM MK Stalin Lord Murugan move Against BJP Ayodhya Ram Mandir - Sakshi

భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్‌’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.  

తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే  మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్‌ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్‌ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్‌, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్‌ మురుగన్‌ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్‌ యాత్ర’ నిర్వహించింది.

డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్‌ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. 

కాగా డీఎంకే సారధ్యలో మురుగన్‌ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసన్‌ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు.

బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్‌ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో తిరుచెందూర్‌ మురుగన్‌ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement