Nuh Violence: Supreme Court Hears Plea To Stop Rallies Amid Protest In Haryana - Sakshi
Sakshi News home page

అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్‌.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు..

Published Wed, Aug 2 2023 3:02 PM | Last Updated on Wed, Aug 2 2023 4:53 PM

Supreme Court Hears Plea To Stop Rallies Amid Protest In Haryana - Sakshi

ఢిల్లీ: హర‍్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప‍్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది.  సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది.

 హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఢిల్లీతో సహా చుట్టపక్కల రాష్ట్రాల్లో దాదాపు 30 వరకు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే ఉన్న అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ర్యాలీలకు అనుమతించవద్దంటూ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అదనపు బలగాలను మోహరించాలని నోటీసుల్లో పేర్కొంది.

ర్యాలీలపై పిటీషన్ దాఖలు..
హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్‌లు ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 

నుహ్, గుర్‌గ్రామ్‌లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు.  

హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. 

హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్‌నెట్ నిలిపివేసింది.  

ఇదీ చదవండి: ఎన్సీఆర్‌కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్‌.. ఢిల్లీ హై అలర్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement