పీరియడ్‌ లీవ్స్‌ కొరకు పిల్‌.. తిరస్కరణ | SC refuses to entertain PIL seeking menstrual pain leave | Sakshi
Sakshi News home page

పీరియడ్‌ లీవ్స్‌ కొరకు పిల్‌.. తిరస్కరణ, పిటిషనర్‌కు ధర్మాసనం కీలక సూచన

Published Fri, Feb 24 2023 9:15 PM | Last Updated on Fri, Feb 24 2023 9:19 PM

SC refuses to entertain PIL seeking menstrual pain leave - Sakshi

ఢిల్లీ: విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో ఋతుస్రావ సమయంలో.. సెలవులు మంజూరుచేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది తమ పరిధిలోని అంశం కాదంటూనే.. పిటిషనర్‌కు కీలక సూచన చేసింది ధర్మాసనం. 

ఇది మా పరిధిలోని అంశం కాదు. విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. కాబట్టి,  పిటిషనర్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించడం సముచితంగా ఉంటుంది అని సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి నెలా మహిళా ఉద్యోగులకు ఋతు నొప్పి సెలవులు(పీరియడ్స్‌ లీవ్‌) మంజూరు చేయాలని కంపెనీలు/యజమానులపై ఒత్తిడి చేస్తే.. అది ఉద్యోగ నియామకాల్లో తీవ్ర ప్రభావం చూపెడుతుందని పిల్‌ను వ్యతిరేకించిన న్యాయవాది(లా స్టూడెంట్‌ ఒకరు) బెంచ్‌ ముందు వాదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిల్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అయితే..

ఈ ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా పిటిషనర్‌ కొన్ని కీలకాంశాలను లేవనెత్తారని.. కాకపోతే ఇది విధానాల రూపకల్పనకు సంబంధించి కావడంతో.. పిల్‌పై విచారణ ముందుకు సాగించలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి.. లాయర్‌ విశాల్‌ తివారీ ద్వారా ఈ పిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అన్ని రాష్ట్రాలు పాటించేలా కేంద్రం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని పిటిషనర్‌ కోరారు. జపాన్‌, తైవాన్‌, ఇండోనేషియా, సౌత్‌ కొరియా, స్పెయిన్‌(మూడు రోజులు.. వీలును బట్టి ఐదు రోజులకు కూడా పొడిగించొచ్చు), జాంబియా.. ఇలా చాలా దేశాల్లో పీరియడ్స్‌ లీవ్‌లను మంజూర చేస్తున్నారు. 

అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961 ప్రకారం.. మహిళలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పెయిడ్‌ లీవ్‌ పొందే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి గర్భం దాల్చిన సమయంలో. అందునా.. ఆ నిబంధనల పర్యవేక్షణ కోసం సెక్షన్‌ 14 ప్రకారం ఒక ఇన్‌స్పెక్టర్‌ నియమించాల్సి ఉంటుంది కూడా. అయితే.. కేంద్ర ప్రభుత్వం అలాంటి పర్యవేక్షకులను ఇంతదాకా నియమించలేదు అని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. 

అంతేకాదు దేశంలో బీహార్‌ రాష్ట్రం మాత్రమే 1992 నుంచి రుతుస్రావ సమయంలో ప్రత్యేక సెలవులను రెండురోజులపాటు మంజూరు చేస్తూ వస్తోందని సదరు పిటిషనర్‌ బెంచ్‌కు తెలిపారు. అలాగే జొమాటో, బైజూస్‌, స్విగ్గీ కూడా పెయిడ్‌ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వికిపీడియా సమాచారం ప్రకారం.. కేరళ ప్రాంతంలో 1912 సంవత్సరంలో ఓ బాలికల పాఠశాలకు పీరియడ్స్‌ లీవ్స్‌ మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అంతేకాదు.. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement