PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్‌ సోలార్‌ రాయితీ 78 వేలు | PM Surya Ghar Muft Bijli Yojna Gets Cabinet Approval | Sakshi
Sakshi News home page

PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్‌ సోలార్‌ రాయితీ 78 వేలు

Published Fri, Mar 1 2024 5:46 AM | Last Updated on Fri, Mar 1 2024 11:13 AM

PM Surya Ghar Muft Bijli Yojna Gets Cabinet Approval - Sakshi

 ‘పీఎం–సూర్య’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం  

రూ.75,021 కోట్లతో పథకం అమలు 

కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌  

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ పథకం ‘పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. రూ.75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబి్ధదారులకు రూ.78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలియజేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.  

జిల్లాకో మోడల్‌ సోలార్‌ గ్రామం  
రూప్‌టాప్‌ సౌర విద్యుత్‌ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్‌ పవర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు.

ఒక కిలో వాట్‌ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్‌ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కలి్పంచారు.

సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలి్పంచడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్‌ సోలార్‌ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్‌టాప్‌ సోలార్‌ పథకాన్ని ప్రమోట్‌ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్‌ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

3 కిలోవాట్ల సౌర విద్యుత్‌ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకుపైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకొని, మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. పీఎం–సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, రాయితీ పొందడానికి https:// pmsuryaghar.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement