భూముల రక్షణకు ‘స్వామిత్వ’ | PM Modi launches physical distribution of property cards under SVAMITVA scheme | Sakshi
Sakshi News home page

భూముల రక్షణకు ‘స్వామిత్వ’

Published Mon, Oct 12 2020 4:02 AM | Last Updated on Mon, Oct 12 2020 9:17 AM

PM Modi launches physical distribution of property cards under SVAMITVA scheme - Sakshi

న్యూఢిల్లీ: ‘గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వామిత్వ’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. అలాగే, దీంతో గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయన్నారు. ఈ ‘సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రొవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌(స్వామిత్వ)’ కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్‌ విధానంలో ప్రధాని పాల్గొన్నారు.

ఆస్తిపై యాజమాన్య హక్కు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. ‘గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తిపై చట్టబద్ధ హక్కును కలిగి ఉండడం వల్ల యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా స్వావలంబన సాధించగలుగుతారు’ అన్నారు.

ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్‌ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్‌ చేయాలని యోచిస్తున్నట్లు ప్రధాని  వెల్లడించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని వెనుకవైపు ఆదివారం జయంతి ఉన్న సోషలిస్ట్‌ నేత జయప్రకాశ్‌ నారాయణ్, ఆరెస్సెస్‌ దిగ్గజం నానాజీ దేశ్‌ముఖ్‌ల ముఖచిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆ మహనీయుల సిద్ధాంతాలను ప్రధాని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు తరచు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుపోతే.. వారే కాకుండా, సమాజమూ అభివృద్ధి చెందబోదని నానాజీ దేశ్‌ముఖ్‌ భావించేవారిని వివరించారు.

ఆ సమస్యను అంతం చేసే దిశగానే ఈ ఆస్తి కార్డుల విధానాన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్‌ ఖాతాలను, విద్యుత్‌ కనెక్షన్, గ్యాస్‌ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామా ల్లో ఈ స్వామిత్వను ప్రారంభించారు. ఈ గ్రామా ల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్‌ఎంఎస్‌ చేసిన లింక్‌ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి. ప్రతీ కార్డుకు ఆధార్‌ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని మోదీ తెలిపారు.  
 
వ్యవసాయ బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారు

దళారి వ్యవస్థ బాగుపడాలని కోరుకునేవారే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మధ్యవర్తులు, దళారులు అందించిన అధికారంతోనే వారు రాజకీయాలు చేశారన్నారు. వారి కుయుక్తులకు రైతులు మోసపోరని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో విపక్ష ప్రభుత్వాలు చేయలేని గ్రామీణాభివృద్ధిని గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ‘దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని చెబుతుంటారు.

కానీ గత ప్రభుత్వాలు గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి’ అని విమర్శించారు. ‘గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు స్వావలంబన సాధించడం చాలా మందికి ఇష్టం ఉండదు. మా సంస్కరణలు రైతుల పొట్టకొడ్తున్న  దళారుల అక్రమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మా సంస్కరణలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. ‘ఆ మధ్యవర్తులు, దళారుల వల్ల బలపడిన కొందరు కూడా ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు’ అని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement