జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి | PM inaugurates, dedicates to nation and lays the foundation stone of multiple development projects | Sakshi
Sakshi News home page

జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి

Published Sun, Dec 31 2023 4:40 AM | Last Updated on Sun, Dec 31 2023 5:14 AM

 PM inaugurates, dedicates to nation and lays the foundation stone of multiple development projects - Sakshi

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురుచూసిందన్నారు. ఏళ్ల తరబడి గుడారంలో గడిపిన రామునికి ఎట్టకేలకు ‘పక్కా ఇల్లు’ సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు.

నూతన విమానాశ్రయంతోపాటు ఆధునీకరించిన రైల్వే జంక్షన్‌ను ప్రారంభించారు. రూ.15,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, వారసత్వం రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని, ఎక్కడివారక్కడే రామాలయ ప్రారంభ వేడుకలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్‌ పథక 10 కోట్లవ లబి్ధదారు ఇంట్లో మోదీ చాయ్‌ ఆస్వాదించారు.     

అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి 22న దేశమంతటా ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. నిత్యం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు.

అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభాన్ని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమంటే అందరికీ దీపావళి పండుగే. దీనికి గుర్తుగా ఆ రాత్రి ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించండి.

అయోధ్యలో రామ్‌లల్లా (బాల రాముడు) ఇంతకాలం తాత్కాలిక టెంట్‌ కింద గడపాల్సి వచ్చింది. ఇప్పుడు దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలతో పాటు రామ్‌లల్లాకు కూడా పక్కా ఇల్లు వచ్చేసింది’’ అని అన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఈ రోజు కోసం యావత్‌ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. కనుక అయోధ్య వాసుల్లో ఇంతటి ఉత్సాహం సహజం. భరత గడ్డపై అణువణువునూ ప్రాణంగా ప్రేమిస్తా. ప్రతి భారతీయుడూ పుట్టిన నేలను ఆరాధిస్తాడు. నేనూ మీలో ఒకడినే’’ అన్నారు.

వికాస్‌.. విరాసత్‌
అత్యంత స్వచ్ఛమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుదామంటూ ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఇది అయోధ్యవాసుల బాధ్యత. జనవరి 14 నుంచి 22వ తేదీ దాక దేశంలోని అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాల్లో స్వచ్ఛత కార్యాక్రమాలు చేపడదాం. దేశం కోసం కొత్త తీర్మానాలు, మనం కోసం కొత్త బాధ్యతలను తలకెతత్తుకుందాం. ఏ దేశమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే. వికాస్‌ (అభివృద్ధి)తో పాటు విరాసత్‌ (వారసత్వం) కూడా ముఖ్యమే.

అవి రెండూ పట్టాలుగా 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఆ రెండింటి ఉమ్మడి అభివృద్ధి బలమే భారత్‌ను ముందుకు నడుపుతుందన్నారు. సభలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మెగా రోడ్‌ షో
శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక మోదీ అక్కడి నుంచి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి రైల్వే స్టేషన్‌ దాకా దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా రోడ్‌షో సాగింది. దారి పొడవునా ప్రధానికి అయోధ్యవాసులు, పలు రాష్ట్రాల నుంచి వచి్చన కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు.

రోడ్‌షో మధ్య మధ్యలో ఏర్పాటుచేసిన 40 కళావేదికల వద్ద పలు రాష్ట్రాల కళాకారులు నృత్య, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వచి్చన కళాకారులు రాముని జీవితంతో ముడిపడి ఉన్న ‘దేధియా’ నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం మోదీ మార్గమధ్యంలో అతిపెద్ద వీణతో అలంకృతమైన లతా మంగేష్కర్‌ చౌక్‌ వద్ద కాసేపు గడిపారు.

ఆ రోజు రాకండి
ఆహా్వనితులు మినహా మిగతా వారు 22న అయోధ్యకు రావద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘‘రామాలయ ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22వ తేదీనే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శనభాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలామంది విశిష్ట అతిథులు విచ్చేస్తున్నారు. కనుక యావత్‌ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితాంతం అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు’’ అని సూచించారు.

వాలీ్మకి మహర్షి ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం
అయోధ్యలో ఆధునిక హంగులతో సిద్దమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాలీ్మకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వాలీ్మకి విరచిత రామాయణం మనకు గొప్ప జ్ఞానపథమని ఈ సందర్భంగా అన్నారు. ‘‘అది మనల్ని శ్రీరామ ప్రభువు చెంతకు చేరుస్తుంది. ఆధునిక భారత దేశంలో అయోధ్య ధామంలోని వాలీ్మకి విమానాశ్రయం మనల్ని దివ్య (మహోన్నత), భవ్య (అద్భుత), నవ్య (ఆధునిక) రామ మందిరానికి చేరుస్తుంది. అప్పట్లో ఇదే రోజున అండమాన్‌ దీవికి బ్రిటిష్‌ చెర నుంచి సుభాష్‌ చంద్రబోస్‌ విముక్తి కలి్పంచారు. అక్కడ జాతీయ జెండా ఎగరేశారు. మనలి్నది ఆజాదీ కీ అమృత్‌ కాల్‌లోకి తీసుకెళ్తుంది’’ అన్నారు.

విమానాశ్రయ విశేషాలు..
► అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాతి్మక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయ నిర్మాణం సాగింది. టెర్మినల్‌ భవనానికి శ్రీరామ మందిరాన్ని తలపించేలా తుదిరూపునిచ్చారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్‌ వేశారు. రాముడి జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలకు విమానాశ్రయంలో చోటు కలి్పంచారు.
► బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు.
► ఎల్‌ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్‌ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.
► చుట్టూతా పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్‌ చేసి ఉపయోగించనున్నారు.
► విమానాశ్రయ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ చెప్పారు.
► ఈ ఎయిర్‌్రస్టిప్‌ గతంలో కేవలం 178
ఎకరాల్లో ఉండేది. దీన్ని రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఇందుకు యూపీ ప్రభుత్వం 821 ఎకరాలు కేటాయించింది.
► ఏటా 10,000 మంది ప్రయాణికుల రాకపోకలను వీలుగా విమానాశ్రయాన్ని విశాలంగా నిర్మించారు. టెరి్మనల్‌ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు.
► 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉండటంతో ఎయిర్‌బస్‌–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ చాలా సులువు. రెండు లింక్‌ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్‌ చేసుకోవచ్చు.
► భవిష్యత్తులో విమానాశ్రయ రెండో దశ విస్తరణ మొదలవనుంది. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరిస్తారు.
► ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
► రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కలి్పంచాలని భావిస్తున్నారు.  


అయోధ్య ధామ్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా
అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.241 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రైల్వేస్టేషన్‌ నుంచి రెండు అమృత్‌ భారత్‌ రైళ్లను, ఆరు వందే భారత్‌ రైలు సేవలను వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ మూడు కొత్త సేవలైన వందే భారత్, నమో భారత్, అమృత్‌ భారత్‌ల ‘త్రిశక్తి’తో భారత రైల్వే నూతన అభివృద్ధి శకంలోకి దూసుకెళ్లగలదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

మూడంతస్తుల నూతన అయోధ్య రైల్వేస్టేషన్‌లో సరికొత్త సౌకర్యాలను కలి్పంచారు. లిఫ్ట్‌లు, కదిలే మెట్లు, ఫుడ్‌ ప్లాజాలు, వాణిజ్య, వ్యాపార సముదాయలు, పూజా సామగ్రి దుకాణాలు, చైల్డ్‌ కేర్, వెయిటింగ్‌ హాళ్లతో స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ వారి సరి్టఫికెట్‌నూ ఈ రైల్వేస్టేషన్‌ సాధించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అమృత్‌ భారత్‌ రైలుకు తొలి రోజు విశేష స్పందన లభించింది. బుకింగ్‌ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement