మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం | Monkeypox Task Force Constituted To Monitor The Emerging Cases | Sakshi
Sakshi News home page

Monkeypox: కేరళ వాసి మృతి, కేంద్రం కీలక నిర్ణయం.. డా.వీకే పాల్ నేతృత్వంలో

Published Mon, Aug 1 2022 12:10 PM | Last Updated on Mon, Aug 1 2022 4:28 PM

Monkeypox Task Force Constituted To Monitor The Emerging Cases - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే గాక, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది.

యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జులై 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ భేటీలోనే మంకీపాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ దీనికి నేతృత్వం వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉ‍న్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్‌ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం.

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు విస్తరించిన ఈ వ్యాధి.. 16వేల మందికి సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: కరోనా, మంకీపాక్స్‌ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement