బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ! Lal Krishna Advani's Political Life & Facts | Sakshi
Sakshi News home page

Lal Krishna Advani: బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ!

Published Sat, Feb 3 2024 12:40 PM | Last Updated on Sat, Feb 3 2024 1:33 PM

Lal Krishna Advani's Political Life & Facts - Sakshi

భారత అత్యన్నత పౌర పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత లాల్ కృష్ణ అద్వానీ(96)కి అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీ జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలను  తెలుసుకుందాం. 

లాల్ కృష్ణ అద్వానీ అసలు పేరు లాల్ కిషన్‌చంద్ అద్వానీ. అతని ప్రారంభ విద్య కరాచీలో సాగింది. తరువాత లాహోర్‌లో చదువుకున్నారు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. బీజేపీని ఇప్పడున్న ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత లాల్ కృష్ణ అద్వానీకే దక్కుతుంది. ఇద్దరు ఎంపీల స్థాయి కలిగిన బీజేపీని 150 మంది ఎంపీలు ఉన్న పార్టీగా రూపొందించిన ఘనత అద్వానీకే దక్కుతుంది. 

అద్వానీ చదువుకునే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1947లో కరాచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్‌ను స్థాపించినప్పుడు, ప్రారంభ సభ్యులలో అద్వానీ కూడా ఒకరు. 1957 వరకు అద్వానీ సంఘ్‌ కార్యదర్శిగా కొనసాగారు. జన్ సంఘ్‌లో ముఖ్యమైన పదవుల్లో పనిచేసిన తర్వాత 1972లో అద్వానీ సంఘ్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

తరువాత ఆ పార్టీ జన్ సంఘ్ నుండి బీజేపీగా మారినప్పుడు.. అంటే 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి 1986 వరకు  లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1986 నుంచి 1991 వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 

90వ దశకంలో లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ద్వయం భారత రాజకీయాలలో కీలక వ్యక్తులుగా మారారు. రామాలయ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటిగా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితం అతి తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.

అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి జంట 1996 లోక్‌సభ ఎన్నికలలో  భిన్నమైన చరిత్రను సృష్టించింది. 1996లో తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ హోంమంత్రిగా పదవులు చేపట్టారు.

ఆలయ ఉద్యమం తర్వాత, అద్వానీకి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. దీంతో అద్వానీని ప్రధానిని చేయాలనే ఆలోచన నాటి బీజేపీ నేతలలో కలిగింది. అయితే అద్వానీ స్వయంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును ప్రధాని పదవికి సూచించారని చెబుతారు. కాగా అద్వానీ అరడజనుకు పైగా రథయాత్రలు చేపట్టారు. వాటిలో ‘రామ రథ యాత్ర’, ‘జనదేశ్ యాత్ర’, ‘స్వర్ణ జయంతి రథయాత్ర’, ‘భారత్ ఉదయ్ యాత్ర’,‘భారత్ సురక్ష యాత్ర’ ముఖ్యమైనవి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement