Kerala Sanitation Workers Pool Money to Buy Rs 250 Lottery Ticket Win 10 Crore - Sakshi
Sakshi News home page

చిల్లర పోగేసి లాటరీ టికెట్ కొన్నారు... కుంభస్థలాన్ని కొల్లగొట్టారు

Published Fri, Jul 28 2023 11:14 AM | Last Updated on Sat, Jul 29 2023 12:55 PM

Kerala Sanitation Workers Pool Money to Buy Lottery Ticket Win 10 Crore - Sakshi

కొచ్చిన్: కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి చందాలు వేసి కొనుక్కున్న లాటరీ  టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకుంది. రాత్రికి రాత్రే అంత పెద్ద మొత్తంలో నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారంతా ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు.    

కేరళ ప్రభుత్వం 2023 వర్షాకాలం బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం 11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. పరప్పనంగడి మునిసిపాలిటీలోని హరిత కర్మ సేనకు చెందిన వీరందరివి అత్యంత నిరుపేద కుటుంబాలు. చందాలు పోగు చేసే సమయానికి వారిలో కొందరి వద్ద కనీసం రూ. 25 కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చేతిలో ఎంత ఉంటే అంత పెట్టి ఎలాగోలా రూ. 250 పోగుచేసి బంపర్ లాటరీ టికెట్టు కొన్నారు. వారు కష్టపడి కొన్న అదే టికెట్‌కు రూ.10 కోట్లు బహుమతి లభించిందని తెలియగానే వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

వారిలో ఒకామె మాట్లాడుతూ..  నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మేము మరికొంతమందిని అడిగి దీన్ని నిర్ధారించుకోవాలి. మేమంతా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవారమే. మాలో చాలామందికి పెద్ద మొత్తంలో  అప్పులున్నాయి. నాకే రూ.3 లక్షలు అప్పు ఉంది. ఇందులో నా వాటా డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాను. డబ్బు సరైన సమయానికి చేతికందిందని అనుకుంటున్నానంది. 

ఇక హరిత కర్మ సేన కోఆర్డినేటర్ వారి సిబ్బందిలో కొంతమంది లాటరీ గెలవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారంతా తమ  జీవనాన్ని సాఫిగా గడపడం కోసం ఏంతో కష్టపడేవారు. వారు సాధారణంగా ప్రతి ఇల్లు తిరిగి చెత్తను సేకరిస్తూ ఉంటారు. వారి నెల జీతం కూడా రూ. 8000 నుండి రూ. 15000 మాత్రమేనని అన్నారు. ఈ లాటరీలో వారి జీవితాలు మారిపోయినట్లేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఈ 11 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ కాటరీ టికెట్ కొంటుండగా గతంలో ఒకసారి వీరికి ఓనమ్ బంపర్ లాటరీలో రూ. 1000 బహుమతి లభించగా ఈ సారి మాత్రం ఏనుగు కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. 

ఇది కూడా చదవండి: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement