భారత్‌కు ఎవరూ పాఠాలు నేర్పాల్సిన పనిలేదు: జగదీప్‌ ధన్కర్‌ | Jagdeep Dhankhar Said India Does Not Need Lessons From Anyone | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు: జగదీప్‌ ధన్కర్‌

Published Sat, Mar 30 2024 9:40 AM | Last Updated on Sat, Mar 30 2024 11:22 AM

Jagdeep Dhankhar Said India Does Not Need Lessons From Anyone - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో చట్టబద్దమైన పాలన కొనసాగుతోందని.. దీన్ని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌. మన దేశానికి ఎవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరంలేదని ధన్కర్‌ చెప్పుకొచ్చారు.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై జర్మనీ, అమెరికా, ఐక్యరాజ్యసమితి స్పందించింది. అటు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంపై కూడా అమెరికా, యూఎస్‌ ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలకు జగదీప్‌ ధన్కర్‌ కౌంటరిచ్చారు. 

తాజాగా జగదీప్‌ ధన్కర్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్‌ అద్వితీయమైన ప్రజాస్వామ్య దేశం. భారత్‌ పటిష్టమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. ఈ విషయంలో ఏ వ్యక్తి లేదా ఏ సమూహం కోసం రాజీపడటం అనేది ఉండదు. మా దేశ చట్టబద్ధమైన పాలనపై ఎవరి నుంచీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. అవినీతి అనేది ఒక అవకాశం. అది జైలుకు వెళ్లే మార్గం. ఎన్నికల సందర్భంగానే ఇదంతా జరిగిందంటున్నారు. దోషులను శిక్షించడానికి ప్రత్యేకంగా సీజన్‌ ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. 

ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఇండియా కూటమి తొలి ర్యాలీని మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్నారు. ఢిల్లీ పోలీసుల నుంచి కూడా ర్యాలీకి ఆమోదం లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించే ఈ ర్యాలీలో కాంగ్రెస్, ఎస్పీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, టిఎంసి, శివసేన (యుబిటి) తదితర పార్టీల పెద్ద నేతలు పాల్గొంటారు. ‘రిమూవ్ డిక్టేటర్‌షిప్, సేవ్ డెమోక్రసీ’ నినాదంతో ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నేతలపై రాజకీయ చర్యలు, ఎలక్టోరల్ బాండ్లు, ఇతర సమస్యలను ర్యాలీ ద్వారా లేవనెత్తుతాయి. రాంలీలా మైదాన్‌లో ర్యాలీకి ఆమోదం లభించిందని ఆప్ ఢిల్లీ రాష్ట్ర సమన్వయకర్త గోపాల్ రాయ్ తెలిపారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత, మాకు ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల నాయకుల నుండి మద్దతు లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 31న ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement