Delhi CM Arvind Kejriwal extends support to protesting wrestlers at Jantar Mantar - Sakshi
Sakshi News home page

Wrestlers Protest: వారిని ఉరితీయాలి.. రెజ్లర్లకు సీఎం కేజ్రీవాల్‌ మద్దతు

Published Sat, Apr 29 2023 7:55 PM | Last Updated on Sat, Apr 29 2023 8:24 PM

Delhi CM Kejriwal Meet Protesting wrestlers Extends Support To Them - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న భారత రెజ్లర్లకు ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్దతు తెలిపారు. మహిళలను లైంగికంగా వేధించే వారిని ఉరితీయాలని అన్నారు. కాగా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులపై రెజ్లర్లు మరోసారి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.  అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా రెజ్లర్లను కలిసిన సీఎం కేజ్రీవాల్‌ వారి నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దేశం గర్వించేలా చేసిన రెజ్లర్లు గత వారం రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారని తెలిపారు. వారిని అవమానించారని.. మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసేవారిని ఉరితీయాలని అన్నారు.  ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌ భూషణ్ సింగ్‌ను కేంద్రం కాపాడుతోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి  సుప్రీంకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమన్నారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు..

‘లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్) ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన అన్నా హజారే దేశ రాజకీయాలను మార్చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న నిరసన కూడా క్రీడల్లో మార్పు తీసుకువస్తుందని తెలిపారు. దేశాన్ని ప్రేమించే వారు సెలవు తీసుకుని వారి నిరసనలో పాల్గోవాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై  ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపుల కేసునమోదు చేశారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై కేసు నమోదవ్వడాన్ని స్వాగతించిన రెజ్లర్లు.. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను అన్ని పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాను నేరస్థుడిని కానని, ఏ తప్పు చేయలేదని బ్రిజ్ భూషణ్ సింగ్ చెబుతున్నారు.  రాజీనామా చేయడమంటే వారి ఆరోపణలను అంగీకరించడమే అవుతుందని, పదవి నుంచి వైదొలగనని పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ప్రతి సారి ఆ పార్టీ ఖతమైంది: మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement