సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన | Defence Minister Rajnath Singh Clarifies On Border Situation | Sakshi
Sakshi News home page

చైనాకు దీటుగా బదులిస్తాం

Published Tue, Sep 15 2020 3:38 PM | Last Updated on Tue, Sep 15 2020 5:19 PM

Defence Minister Rajnath Singh Clarifies On Border Situation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు.

చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్‌ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్‌లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోందని, డ్రాగన్‌ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

భారత్‌ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్‌కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో  చర్చలకు భారత్‌ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దుల విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు.ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. చదవండి : రఫేల్‌ రాక.. చైనాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement