‘పుణె పోర్షే కారు’ ప్రమాదం: పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం | Bombay High Court Key Observations On Pune Porsche Accident | Sakshi
Sakshi News home page

మైనర్‌ను తిరిగి కస్టడీకి తీసుకోవడం నిర్బంధం కాదా.. ?పోలీసులకు హైకోర్టు ప్రశ్న

Published Fri, Jun 21 2024 3:59 PM | Last Updated on Fri, Jun 21 2024 4:16 PM

Bombay High Court Key Observations On Pune Porsche Accident

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రమాద సమయంలో కారు నడిపిన మైనర్‌కు ఒకసారి బెయిల్‌ ఇచ్చి మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం ఏంటని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. 

బెయిల్‌ మంజూరు తర్వాత కూడా మైనర్‌ను అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉంచడంపై అతడి సమీప బంధువు ఫైల్‌ చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం(జూన్‌21) విచారించింది. పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ భారతి డాంగ్రే, జస్టిస్‌ మంజూష దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇది దురదృష్టకరమే. అయితే కారు నడిపిన మైనర్‌ కూడా ఒక రకంగా బాధితుడే. ఏ నిబంధన కింద బెయిల్‌తర్వాత అతడిని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు. ఇది నిర్బంధం కిందకు రాదా. కనీసం పోలీసులు బెయిల్‌ రద్దు పిటిషన్‌ కూడా వేయలేదు. కేవలం బెయిల్‌ ఆర్డర్‌ సవరించాలని పిటిషన్‌ వేశారు.

దానిపైనే తీర్పు ఇస్తూ మైనర్‌ను అబ్జర్వేషన్‌ హోమ్‌కు పంపారు. ఏ రకమైన రిమాండ్‌ ఇది. ఒక వ్యక్తికి బెయిల్‌ ఇచ్చి మళ్లీ ఏ నిబంధనల ప్రకారం కస్టడీలోకి తీసుకున్నారు’అని  బెంచ్‌ ప్రశ్నించింది.

అయితే మైనర్‌ బెయిల్‌ ఆర్డర్‌ మార్చి అతడిని అబ్జర్వేషన్‌ హోమ్‌కు పంపడం సరైనదే అని ప్రాసిక్యూషన్‌ వాదించింది. దీంతో  ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారానికి రిజర్వు చేసింది. కాగా, మే 19వ తేదీ తెల్లవారుజామున పుణెలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లను వేగంగా వచ్చిన పోర్షే కారు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఇద్దరు యువ ఇంజినీర్‌లు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్‌కు జువైనైల్‌ బోర్డు తొలుత బెయిల్‌ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా  బెయిల్‌పై తీవ్ర నిరసన రావడంతో తర్వాత మైనర్‌ను అబ్జర్వేషన్‌ హోమ్‌కు పంపిస్తూ ఆదేశాల్లో మార్పు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement