ఆర్టికల్‌ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు? | Article 370 A History, Supreme Court Judgement | Sakshi
Sakshi News home page

Article 370: ఆర్టికల్‌ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు?

Published Mon, Dec 11 2023 12:24 PM | Last Updated on Mon, Dec 11 2023 1:02 PM

Article 370 A History, Supreme Court Judgement - Sakshi

భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్రప్రతిపత్తి  జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1947ఆగస్ట్ 15న భారత్, పాక్ స్వాతంత్య్రం పొందాయి. నాడు శ్రీనగర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత్ సాయం కోరిన జమ్మూకశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రధానిగా హేక్‌అబ్దుల్లాను (1949) భారత్‌ నియమించింది. 

1949 అక్టోబర్ 17న..
రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ ఉన్నారు. 1949 అక్టోబర్ 17న కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలో 370 ఆధికరణను చేర్చింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనను అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1954లో 35ఏ నిబంధన జరిగింది. 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే ఈ ప్రత్యేకప్రతిపత్తిని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది.

ఆర్టికల్ 370 రూపకర్త..  
ఒకప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధాన రూపకర్త. 1937-43 కాలంలో జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1947 అక్టోబర్‌లో కేంద్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్రమంత్రిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది.


Photo Credits: LIVE LAW HINDI

ఆర్టికల్ 370 అంటే..
భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలూ, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయన్న నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్‌లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. 

సమస్యలకు, వివాదాలకు నిలయం..
మొదటి నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కశ్మీర్‌లో క్రయవిక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతిభద్రతలు అదుపులో లేకపోవడంతో ఇన్నాళ్లూ పెద్ద కార్పొరేట్ కంపెనీలేవీ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. మరొకవైపు ఉగ్రదాడులకు స్థావరంగా మారడంతో ప్రబుత్వానికి ఆర్టికల్‌ 370 రద్దు అనివార్యమైంది.

ఎప్పుడైనా స్వతంత్రప్రతిపత్తి రద్దు..
ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా కశ్మీర్‌కు ఇచ్చిన స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేయడానికి అధికారాలున్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఈ నిబంధనతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వినియోగించుకున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ నుంచి తప్పించుకుంది. 

ఆర్టికల్ 370 రద్దు ఇలా..
భారత రాజ్యసభలో ఆగస్ట్ 5, 2019న ఉదయం 11 గంటకు, లోక్‌సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  అనుమతిని తెలుపుతూ గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దు జరిగింది. 360 రద్దుతో 35ఏ ఆర్టికల్ కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఢిల్లీ తరహా పాలన అమలులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement